ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డును తన ఖాతాలోకి వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై తన సిక్సర్ల సంఖ్యను 51కి పెంచుకున్నాడు.
తద్వారా ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన విభాగంలో ఎంఎస్ ధోనిని అధిగమించాడు. ధోని ఆర్సీబీపై 50 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో రోహిత్, ధోని తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. విరాట్ సీఎస్‌కేపై 48 సిక్సర్లు కొట్టాడు.
ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఓ ప్రత్యర్దిపై అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్ పంజాబ్ కింగ్స్‌పై 61, కేకేఆర్‌పై 54 సిక్సర్లతో తొలి స్థానాలను ఆక్రమించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై మెరుపు అర్ద సెంచరీ (38 బంతుల్లో 78 పరుగులు; సిక్స్‌లు, 7 ఫోర్లు) చేసిన అతను.. ఇవాళ ఢిల్లీతో మ్యాచ్‌లో 26 బంతుల్లో 35 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు.
ఢిల్లీ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ 19 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.
ముకేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, నటరాజన్ తలో వికెట్ తీశారు. కుల్దీప్ యాదవ్ (3-0-31-0) మినహా ఢిల్లీ బౌలర్లంతా పొదుపుగా కూడా బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌లో తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51) అర్ద సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ (35) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు.


