ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 12) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై (వాంఖడే స్టేడియం) ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి.
ఈ ఓటమి తర్వాత ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమస్యలున్నట్లు చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేల్లో మొమెంటమ్ లేదని అభిప్రాయపడ్డాడు. టాస్ వ్యూహంపై పునరాలోచించుకోవాలని అన్నాడు. రూథర్‌ఫోర్డ్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. మొత్తంగా జట్టు సమస్యలపై ఆత్మపరిశీలనకు సమయం ఆసన్నమైందని తెలిపాడు.
హార్దిక్ మాటల్లో.. అవును, మేము చాలా వికెట్లు కోల్పోయాము. అదే సమయంలో బౌలింగ్‌లోనూ చాలా పరుగులు ఇచ్చాము. పెద్ద ఓవర్లు వేసినప్పుడు క్యాచ్ అప్ మోడ్‌లో ఉండిపోయాము. గత రెండు, మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమయ్యాము.
టాస్ వ్యూహంపై పునరాలోచించాలి. టాస్ గెలిచినా దాన్ని అనుకూలంగా మార్చుకోలేకపోయాము. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొత్త ఆప్షన్లను పరిశీలించాలి. పిచ్ పరిస్థితులను బట్టి మొదటి బ్యాటింగ్ చేయడం కూడా మంచిదే. పవర్‌ప్లేలో మొమెంటం లేదు. మొదటి ఆరు ఓవర్లలోనే గేమ్ మాకు దూరమవుతోంది. కాబట్టి పవర్‌ప్లేలో ఎలా మొమెంటం తెచ్చుకోవాలో చర్చిస్తున్నాము.
రూథర్‌ఫోర్డ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. అతని ప్రదర్శన సంతృప్తినిస్తుంది. రూథర్‌ఫోర్డ్‌ను తీసుకున్నప్పుడే అతని శక్తి, సామర్థ్యం గురించి మాకు తెలుసు. ఆయన బ్యాటింగ్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తోంది. అవసరమైతే మార్పులు చేయడానికి కాన్ఫిడెన్స్ కూడా ఇస్తోంది.
ఆర్సీబీ చేతిలో ఓటమి అనంతరం హార్దిక్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. తదుపరి మ్యాచ్‌ల్లో ఆ జట్టు వ్యూహాలు మార్చే అవకాశం ఉంది. వైఫల్యాలను అతను నిర్మోహమాటంగా అంగీకరించాడు.
ఇదిలా ఉంటే, తాజా ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ మినహా వరుస పరాజయాలు ఎదుర్కొంది. తదుపరి మ్యాచ్‌ను ఆ జట్టు ఏప్రిల్ 16న ఇదే వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.
ముంబై-ఆర్సీబీ మ్యాచ్ వివరాలు..
ఆర్సీబీ- 240/4(20)
ముంబై ఇండియన్స్- 222/5(20)
18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్-ఫిల్ సాల్ట్
కీలక ప్రదర్శనలు
ఆర్సీబీ- ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1)
ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్‌ఫోర్డ్ (71 నాటౌట్)


