చెలరేగిన రాహుల్‌.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ | IPL 2026, Match 43: Delhi Capitals Beat Rajasthan Royals | Sakshi
Sakshi News home page

చెలరేగిన రాహుల్‌.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ

May 1 2026 11:30 PM | Updated on May 1 2026 11:30 PM

IPL 2026, Match 43: Delhi Capitals Beat Rajasthan Royals

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన 43వ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. జైపూర్‌లోని సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ తమ నిర్ణయానికి న్యాయం చేస్తూ భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. 

రియాన్‌కు కాసేపు జురెల్‌ (42) సహకరించారు. ఆఖర్లో డొనొవన్‌ ఫెరియెరా గత మ్యాచ్‌ తరహాలో చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 2 ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (6), వైభవ్‌ సూర్యవంశీ (4), షుభమ్‌ దూబే (6) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. రవీంద్ర జడేజా (20) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లతో రాణించగా.. జేమీసన్‌, అక్షర్‌ పటేల్‌, నటరాజన్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ తొలి బంతి నుంచే గెలుపుపై కసితో ఆడింది. ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (62), కేఎల్‌ రాహుల్‌ (75) అద్భుతమైన అర్ద సెంచరీలతో జట్టు గెలుపుకు గట్టి పునాది వేశారు. అనంతరం నితీశ్‌ రాణా (33), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (18 నాటౌట్‌), అశుతోష్‌ శర్మ (26 నాటౌట్‌) తమవంతు పాత్రలు పోషించి ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. 

19.1 ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement