ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. తిరుగులేని టీ20 కెరీర్‌లో అతను అరుదైన హ్యాట్రిక్ సాధించాడు. 273 మ్యాచ్‌ల పొట్టి క్రికెట్ ప్రస్తానంలో కేవలం నాలుగోసారి మాత్రమే వికెట్ లేకుండా వరుసగా మూడు టీ20లను (హ్యాట్రిక్) ముగించాడు. నిన్న (ఏప్రిల్ 7) రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో వికెట్ లేకుండా పోవడంతో బుమ్రా ఖాతాలో ఈ అనవసర రికార్డు చేరింది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో బుమ్రా వరుసగా కేకేఆర్ (4-0-35-0), ఢిల్లీ (4-0-21-0), రాజస్థాన్ (3-0-32-0) మ్యాచ్‌ల్లో వికెట్ తీయలేకపోయాడు.
బుమ్రా టీ20 కెరీర్‌లో ఇలాంటి సందర్భాలు..
- 2016 IPL: SRH, RCB, KXIPతో వరుసగా జరిగిన మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు.
- 2014 IPL: CSK, SRH, KKR, RRతో వరుసగా జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు.
- 2017/18 T20Is: శ్రీలంక, దక్షిణాఫ్రికాపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు.
పై నాలుగు సందర్భాలు మినహా, బుమ్రా తన యావత్ టీ20 కెరీర్‌లో మరెప్పుడు వరుసగా 3 మ్యాచ్‌ల్లో వికెట్లు లేకుండా ఉండలేదు. 273 మ్యాచ్‌ల పొట్టి క్రికెట్ కెరీర్‌లో బుమ్రా 6.92 సగటున 345 వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరీర్ మాత్రమే తీసుకుంటే.. ఈ లీగ్‌లో 148 మ్యాచ్‌ల్లో 7.26 సగటున 183 వికెట్లు పడగొట్టాడు.
బుమ్రాను సైతం వదలని సూర్యవంశీ
రాజస్థాన్ రాయల్స్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చుక్కలు చూపించాడు.
బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్.. అదే ఓవర్‌లో నాలుగో బంతిని మరోసారి స్టాండ్స్‌కు పంపించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ దెబ్బకు బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.
వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్, రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు.
అనంతరం బరిలోకి దిగిన ముంబై 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. వైభవ్, జైస్వాల్ ధాటికి బుమ్రా వికెట్ లేకుండానే ఇన్నింగ్స్‌ను ముగించాడు.


