Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది.
రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 36 పరుగులు) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారు విఫలం కావడంతో రాజస్తాన్ లక్ష్య ఛేదనలో పూర్తిగా చతికిలపడింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా, జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీశాడు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది.
రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్‌రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు వరుసగా రెండో ఓటమి చవిచూసిన రాజస్తాన్ ఐదో స్థానానికి పడిపోయింది.
గుజరాత్ ఓపెనర్ల దూకుడు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ శుభారంబాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు శతక భాగస్వామ్యం (118 పరుగులు) జోడించి ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. అర్థసెంచరీ అనంతరం సాయి సుదర్శన్ వెనుదిరిగినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బట్లర్, వాషింగ్టన్ సుందర్‌లతో కలిసి గిల్ భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో సుందర్, తెవాటియా ధాటిగా ఆడడంతో గుజరాత్ 220 ప్లస్ స్కోరును దాటింది.
చేధనలో చతికిలపడి..
230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు వైభవ్ సూర్యవంశీ తన దనాధన్ ఇన్నింగ్స్‌తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే సూర్యవంశీ ఔటైన తర్వాత రాజస్తాన్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. జురేల్, జడేజాలు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం మినహా ఏం చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ఓటమి దిశగా పయనించింది. ఈ సీజన్‌లో గుజరాత్ చేతిలో రాజస్తాన్‌కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.
A 𝙏𝙞𝙩𝙖𝙣𝙞𝙘 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 by 7⃣7⃣ runs✌️
4⃣th consecutive win for @gujarat_titans as they move to no.2⃣ in the Points Table 🔢
This is also #GT's biggest #TATAIPL win (by runs) 👏👏
Scoreboard ▶️ https://t.co/t7CEEL9Bzp#KhelBindaas | #RRvGT pic.twitter.com/jXKWcdBfru— IndianPremierLeague (@IPL) May 9, 2026
చదవండి: వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్‌లో తొలి క్రికెటర్‌గా!


