ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ప్రస్తుత రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌లో నూర్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన తర్వాత వికెట్‌కీపింగ్ చేస్తున్న సంజూను కవ్విస్తూ ఓవరాక్షన్ చేశాడు. సంజూ తరహాలోనే కండలు చూపిస్తూ, ఇది నా పవర్ అన్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది.
— crictalk (@crictalk7) March 31, 2026
ఇది చూసి సంజూ అభిమానులు హర్ట్ అయ్యారు. హనుమంతుని ముందా కుప్పిగంతులు అంటూ పంచ్‌లు వేశారు. మాజీ కెప్టెన్ అన్న గౌరవం కూడా లేదా అంటూ మండిపడ్డారు. కెప్టెన్ కాగానే కళ్లు నెత్తికెక్కాయా అంటూ వార్నింగ్‌లు ఇచ్చారు.
వాస్తవానికి రియాన్‌ను ఇలాంటి అతి ప్రవర్తన కొత్తేమీ కాదు. అతనికి ఓవరాక్షన్ స్టార్ అన్న బిరుదు కూడా ఉంది. అయితే, తాజా మాజీ కెప్టెన్ విషయంలోనూ ఇలా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. రియాన్ ఏ ఉద్దేశంతో కండలు చూపించినా, అది సంజూ అభిమానులను మాత్రం హర్ట్ చేసింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రియాన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ సీఎస్‌కేపై ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో సీఎస్‌కేను 127 పరుగులకే కుప్పకూల్చి, ఆతర్వాత మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలిసారి సీఎస్‌కేకు ఆడుతున్న సంజూ శాంసన్ (6) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలం కాగా.. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా రియాన్ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టాడు.
బౌలింగ్‌లో కలిసికట్టుగా సీఎస్‌కే పతనాన్ని శాశించిన రాయల్స్.. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో విరుచుకుపడటంతో 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్‌లో ఘనంగా బోణీ కొట్టింది.


