గతేడాది చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే). చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్‌లో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐదు మ్యాచ్‌ల తర్వాత జట్టుకు దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని జట్టును ముందుకు నడిపాడు.
ఊహించని నిర్ణయం
అయితే, పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది సీఎస్‌కే. దీంతో జట్టు ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సీఎస్‌కే ఊహించని నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్, సీఎస్‌కే మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను ట్రేడ్ చేసింది.
సంజూ శాంసన్ చేరిక
జడ్డూను రాజస్తాన్ రాయల్స్‌కు ఇచ్చేసి.. అతడికి బదులుగా ఆ జట్టు కెప్టెన్, టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson)ను జట్టులో చేర్చుకుంది. దీంతో వికెట్ కీపింగ్‌లో ధోని వారసుడిగా సంజూ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అంతేకాదు రుతురాజ్ గైక్వాడ్‌ను కాదని సంజూను కెప్టెన్ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, సీఎస్‌కే మాత్రం రుతుకే మరోసారి పగ్గాలు అప్పగించింది.
నాతో పాటు ఓపెనర్‌గా
ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ పాత్ర ఏమిటన్న అంశంపై రుతురాజ్ గైక్వాడ్ తాజాగా స్పందించాడు. ముంబైలో బుధవారం జరిగిన కెప్టెన్ల సమావేశానికి రుతు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తాను, సంజూ ఈసారి ఓపెనర్లుగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశాడు. తద్వారా ఈసారి సీఎస్‌కే ఓపెనింగ్ జోడీ ఎవరన్న ప్రశ్నకు తెరదించాడు.
కాగా ఓపెనర్‌గా రుతుకు గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి 60 ఇన్నింగ్స్‌లో అతడు 2289 పరుగులు చేశాడు. అయితే, గతేడాది రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి సీఎస్‌కే ఓపెనర్లుగా బరిలోకి దిగగా.. మూడో స్థానంలో రుతురాజ్ వచ్చాడు.
ఓపెనర్‌గానే బెస్ట్
ఇక ఇప్పటికి ఓవరాల్‌గా వన్‌డౌన్‌లో ఎనిమిది ఇన్నింగ్స్ ఆడిన రుతు కేవలం 208 పరుగులే చేశాడు. దీంతో మరోసారి తానే ఓపెనింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. టీమిండియా, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా సంజూకు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో అతడిదే కీలక పాత్ర. నాకౌట్ మ్యాచ్‌లలో సంజూ 97*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. ప్రపంచ రికార్డు


