
Photo Courtesy: BCCI
ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా రాజస్తాన్ ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడింది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (35) రాణించగా.. సునిల్ నరైన్ (11) విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ అజింక్య రహానే (30), అంగ్‌క్రిష్ రఘువన్షీ (44) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
ఆండ్రీ రసెల్ తొలి ఫిఫ్టీ
ఇక ఆఖర్లో ఆండ్రీ రసెల్ (Andre Russel), రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించారు. రసెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 57 పరుగులతో చెలరేగగా.. రింకూ ఆరు బంతుల్లో 19 పరుగులతో దుమ్ములేపారు. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేకేఆర్ 206 పరుగులు సాధించింది.
రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్‌వీర్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రాజస్తాన్‌కు వరుస షాకులు తగిలాయి. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (4), వన్‌డౌన్‌లో వచ్చిన కునాల్ సింగ్ రాథోడ్ (0) పూర్తిగా విఫలమయ్యారు.
రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్
వీరికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (0), వనిందు హసరంగ (0) కూడా చేతులెత్తేశారు. ఇలాంటి కఠిన దశలో రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 45 బంతుల్లోనే 95 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ హర్షిత్ రాణా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి వైభవ్ అరోరాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
పరాగ్ అవుటైన తర్వాత జోఫ్రా ఆర్చర్ (12), శుభమ్ దూబే (25 నాటౌట్) ఆఖరి బంతి వరకు పోరాడారు. కానీ చివరి బాల్‌కు మూడు పరుగులు కావాల్సి ఉండగా.. ఆఖరి బంతికి ఆర్చర్ రనౌట్ కావడంతో రాయల్స్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి రాజస్తాన్ 205 పరుగుల వద్ద నిలిచిపోయింది.
ఫలితంగా కేకేఆర్ సొంతగడ్డపై ఒక్క పరుగు తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రాజస్తాన్‌కు ఇది తొమ్మిదో పరాజయం. దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. మరోవైపు.. 11 మ్యాచ్‌లలో ఐదు గెలిచిన కేకేఆర్ ఆరో స్థానానికి ఎగబాకింది.
ఐపీఎల్ 2025: కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్
👉కేకేఆర్ స్కోరు: 206/4 (20)
👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)
👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్ విజయం
👉ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్: ఆండ్రీ రసెల్
చదవండి: శెభాష్ రియాన్!.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు.. కానీ పాపం..
Another day, another #TATAIPL classic 🤩@KKRiders prevail by 1️⃣ run in a last-ball thriller in Kolkata to boost their playoff hopes 👏💜
Scorecard ▶ https://t.co/wg00ni9CQE#KKRvRR pic.twitter.com/mJxuxBSPqw— IndianPremierLeague (@IPL) May 4, 2025