
Photo Courtesy: BCCI/IPL
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs RR)తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) అద్భుత ఇన్నింగ్స్ ఆడినా వృథాగానే పోయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
45 బంతుల్లో 95 పరుగులు
ఇరవై ఏడు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రియాన్ పరాగ్.. ఆ తర్వాత ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది స్కోరు బోర్డును దౌడు తీయించాడు. కేకేఆర్ స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్ (13వ ఓవర్)లో వరుస సిక్స్‌లతో అలరించి వహ్వా అనిపించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి 95 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 45 బంతుల్లో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టడంతో రియాన్ పరాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఐదు, ఆరో నంబర్ బ్యాటర్లు ధ్రువ్ జురెల్, వనిందు హసరంగ డకౌట్ కావడం పట్ల రియాన్ ఆగ్రహానికి లోనయ్యాడు.
రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి ధ్రువ్ జురెల్ (0)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మరో రెండు బంతులకు అదే రీతిలో వనిందు హసరంగ (0)ను కూడా బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు.
చూపుతోనే చంపేసేలా
ఇక హసరంగ అవుట్ కావడాన్ని రియాన్ పరాగ్ సహించలేకపోయాడు. సహచర ఆటగాడిని ఒ క్క చూపుతోనే బెంబెలెత్తేలా ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కొంత మంది రియాన్ ఆగ్రహంలో అర్థం ఉందని అంటుంటే.. మరికొందరు మాత్రం కెప్టెన్‌గా ఉండటం మామూలు విషయం కాదని అతడికి ఇప్పుడే తెలిసి వస్తోందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్ ఆదివారం కోల్‌కతాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 206 పరుగులు సాధించింది.
ఒక్క పరుగు తేడాతో ఓడి
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినా.. రియాన్ తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆఖరి బంతి వరకు రాజస్తాన్ పోరాడిందంటే అందుకు కారణం కెప్టెన్. అయితే, రియాన్ అవుటైన తర్వాత పరిస్థితి మారిపోయింది.
చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన వేళ.. శుభమ్‌తో కలిసి పరుగు పూర్తి చేసిన జోఫ్రా ఆర్చర్ రనౌట్ అయ్యాడు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖరారైంది. కేకేఆర్ చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓడి.. ఈ సీజన్‌లో పన్నెండింట తొమ్మిదో పరాజయం నమోదు చేసింది.
రాజస్తాన్ బ్యాటర్లలో రియాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరవగా.. యశస్వి జైస్వాల్ (34), షిమ్రన్ హెట్‌మెయిర్ (29), శుభమ్ దూబే (14 బంతుల్లో 25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. మిగతా వాళ్లలో వైభవ్ సూర్యవంశీ(4) పూర్తిగా విఫలం కాగా.. కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్, హసరంగ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆర్చర్ ఆఖర్లో 12 పరుగులు చేశాడు.
చదవండి: వైభవ్ సూర్యవంశీలా సెంచరీ చేయనక్కర్లేదు!.. ఆయుశ్‌కు ధోని చెప్పిందిదే!
Through the gate ✖ 2️⃣ \|/
Varun Chakaravarthy is weaving his magic in Kolkata! 👏
Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @chakaravarthy29 | @KKRiders pic.twitter.com/vHcMTObTrL— IndianPremierLeague (@IPL) May 4, 2025