
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన రసవత్తర సమరంలో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలిచింది. లక్నో నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా చివరికి విజయం సాధించింది. ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి ఢిల్లీని గెలిపించారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఢిల్లీని అశుతోష్.. ట్రిస్టన్ స్టబ్స్ (22 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ సాయంతో గెలిపించాడు.
అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి చివరి ఓవర్‌లో గెలుపుకు 6 పరుగులు కావాలి. తొలి బంతికి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మోహిత్ శర్మ స్టంపింగ్‌ను మిస్ చేశాడు. దీంతో ఊపిరిపీల్చుకున్న ఢిల్లీ ఆ తర్వాత మూడో బంతిని అశుతోష్ సిక్సర్‌గా మలచడంతో సంబరాలు చేసుకుంది. ఐపీఎల్‌లో ఇంత భారీ లక్ష్యాన్ని (210) ఛేదించడం ఢిల్లీకి ఇదే మొదటిసారి. ఐపీఎల్‌లో ఓ జట్టు లక్నోపై 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించడం కూడా ఇదే మొదటిసారి.
మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఎందుకో తెలీదు నా కెప్టెన్సీలోనే ఇలా జరుగుతుంది. పరిస్థితులు అప్ అండ్ డౌన్‌గా ఉంటాయి. మొత్తానికి మేం గెలిచాం. ఇప్పుడు ఆ ఓవర్ స్టబ్స్‌కి ఎందుకు ఇచ్చావని జనాలు నన్ను తిట్టరు. చివరిసారిగా ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఎప్పుడు చూశానో గుర్తులేదు.
మొదటి ఆరు ఓవర్లలో వాళ్ళు (మార్ష్, పూరన్) ఆడిన తీరు చూస్తే ఈజీగా 240 పైచిలుకు పరుగులు సాధిస్తారని అనుకున్నా. మా బౌలర్లు చాలా ఎక్కువ పరుగులు ఇచ్చారని అనిపించింది. మొదట్లో మేము కొన్ని క్యాచ్‌లు కూడా వదిలేశాము. అయినా తిరిగి ఆటలోకి రాగలిగాము. విప్రాజ్ సామర్థ్యం గురించి మాకు ముందే తెలుసు.
కాగా, ఈ మ్యాచ్‌లో అక్షర్ ట్రిస్టన్ స్టబ్స్‌తో 13వ ఓవర్ వేయించాడు. అప్పటికే శివాలెత్తిపోయిన పూరన్ స్టబ్స్ బౌలింగ్‌లో మరింత రెచ్చిపోయి వరుసగా నాలుగు సిక్సర్లు, బౌండరీ సహా 28 పరుగులు పిండుకున్నాడు. అక్షర్ ఆ సమయంలో స్టబ్స్‌తో ఎందుకు బౌలింగ్ చేయించాడో ఎవరికీ అర్దం కాలేదు.