వాళ్లిద్దరు అద్భుతం.. రోహిత్‌, కోహ్లి పనైపోయిందన్న టీమిండియా మాజీ స్టార్‌! ఏం మాట్లాడుతున్నారు సర్‌?!

IPL 2023: Moved On From Kohli Rohit Ex India Star Blunt T20 Verdict - Sakshi

IPL 2023- Virat Kohli- Rohit Sharma: ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు తమ అద్భుత బ్యాటింగ్‌తో క్రికెట్‌ ప్రేమికులను అమితంగా ఆకట్టుకున్న క్రికెటర్లు అంటే.. టక్కున గుర్తొచ్చే పేర్లు.. సూర్యకుమార్‌ యాదవ్‌, యశస్వి జైశ్వాల్‌. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్య ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు.

పరుగుల సునామీ సృష్టించిన సూర్య
ఆర్సీబీతో మంగళవారం (మే 9) నాటి మ్యాచ్‌లో 35 బంతుల్లో 7 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో ఈ మిస్టర్‌ 360 ప్లేయర్‌ 83 పరుగులు సాధించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల సునామీ సృష్టించి ముంబైకి విజయం అందించి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకు తీసుకువచ్చాడు.

సరికొత్త రికార్డుతో యశస్వి ఇలా
ఇక ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో  గురువారం (మే 11) నాటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! 13 బంతుల్లో అర్ధ శతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడీ 21 ఏళ్ల ముంబై బ్యాటర్‌. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 98 పరుగులు రాబట్టాడు.

సెంచరీ మిస్‌.. మనసులు గెలిచాడు
కీలక మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి బౌండరీ బాది రాజస్తాన్‌ను విజయతీరాలకు చేర్చిన యశస్వి.. కేవలం రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ కావడం మ్యాచ్‌ చూస్తున్న ప్రతీ ఒక్కరి మనసును మెలిపెట్టిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో విజయానంతరం యశస్వి మాట్లాడుతూ.. వ్యక్తిగత రికార్డుల గురించి తాను ఆలోచించలేదని, జట్టు రన్‌రేటు పెంచడమనే విషయమే తన మైండ్‌లో ఉందని చెప్పడం మరోసారి అభిమానుల హృదయాలను గెలిచింది.

రోహిత్‌, కోహ్లి పనైపోయింది!
నేపథ్యంలో యశస్వి అద్భుత ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, మాజీ సెలక్టర్‌ సబా కరీం చేసిన ట్వీట్‌ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 

‘‘జైశ్వాల్‌, స్కై(సూర్యకుమార్‌ యాదవ్‌) బ్యాటింగ్‌ చూస్తుంటే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి నుంచి టీ20 క్రికెట్‌ మూవ్‌ ఆన్‌ అయినట్లు కనిపిస్తోంది’’ అని ట్వీట్‌ చేసిన సబా కరీం.. అనిల్‌ కుంబ్లే, హర్షా కుంబ్లేలను ట్యాగ్‌ చేశాడు. ఇందుకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

‘మీరు చెప్పిందే సరైందే! ప్రస్తుతం రోహిత్‌, కోహ్లి టీ20 క్రికెట్‌లో మునుపటిలా తమదైన ముద్ర చూపలేకపోతున్నారు’’ అంటూ కొంతమంది సబాకు మద్దతు ప్రకటిస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ‘‘లీగ్‌ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. 

ఇలా మాట్లాడటం సరికాదు
యశస్వి, సూర్యను ప్రశంసించడంలో తప్పులేదు. కానీ.. టీమిండియాను ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించిన రోహిత్‌- కోహ్లిలను తక్కువ చేయకూడదు. కెప్టెన్‌ రోహిత్‌ పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడన్న మాట వాస్తవం.

కానీ కోహ్లి ఆసియా టీ20 కప్‌-2022, టీ20 ప్రపంచకప్‌-2022లో ఆడిన ఇన్నింగ్స్‌ ఎలా మర్చిపోతారు. ఆసియాకప్‌లో సెంచరీ చేసిన కోహ్లిని టీ20 ఫార్మాట్‌లో ఇక తనదైన ముద్ర చూపలేకపోవచ్చని ఎలా అంటారు?

ఐపీఎల్‌-2023లోనూ కోహ్లి తన హవా చూపిస్తున్నాడు కదా!’’ అని సబా కరీంకు చురకలు అంటిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2023లో యశస్వి జైశ్వాల్‌ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌లో 167.15 స్ట్రైక్‌రేటుతో 575 పరుగులు సాధించాడు.  

ఇక సూర్య 186.13 స్ట్రైక్‌రేటుతో 376 పరుగులు చేయగా.. ఆర్సీబీ బ్యాటర్‌ కోహ్లి 11 ఇన్నింగ్స్‌లో 133.75 స్ట్రైక్‌రేటుతో 420 పరుగులు సాధించాడు. ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 ఇన్నింగ్స్‌లో అతడు చేసిన పరుగులు 191. ఈ ఓపెనర్‌ బ్యాటర్‌ నమోదు చేసిన అత్యధిక స్కోరు: 65. ఈ నేపథ్యంలో సబా కరీం ఈ మేరకు ట్వీట్‌ చేయడం గమనార్హం.

చదవండి: జైస్వాల్‌ సెంచరీ చేయకుండా అడ్డుకున్న సుయాశ్‌.. ఏకి పారేసిన ఆకాశ్‌
నాకే ఎందుకిలా? వెక్కి వెక్కి ఏడ్చా.. గుండు చేసుకున్నా: సూయశ్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top