IPL 2023: Kohli Million Dollar Gesture For Suryakumar After MI Star Blast, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli-SKY: కాలం మారుతుంది! సూర్య అవుట్‌ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. ఆ తర్వాత; వీడియో వైరల్‌

Published Wed, May 10 2023 11:49 AM

IPL 2023: Kohli Million Dollar Gesture For Suryakumar After MI Star Blast Goes Viral - Sakshi

IPL 2023- MI Vs RCB- Virat Kohli- Suryakumar Yadavఐపీఎల్‌-2023 ఆరంభంలో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు అర్ధ శతకాలు బాదిన స్కై.. ఆర్సీబీతో తాజా మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డారు.

బెంగళూరు జట్టు విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సూర్య తన విశ్వరూపం ప్రదర్శించాడు. 35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అసలైన టీ20 స్టార్‌
ఐపీఎల్‌లో తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ను ప్లే ఆఫ్‌ రేసులో ముందుకు తీసుకువచ్చాడు. దీంతో సూర్య ఆట తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. అసలైన టీ20 స్టార్‌ అని మరోసారి నిరూపించుకున్నాడంటూ ఈ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ను కొనియాడుతున్నారు ఫ్యాన్స్‌.

సూర్యను హత్తుకున్న కోహ్లి
ఇదిలా ఉంటే.. సూర్య అద్భుత ఇన్నింగ్స్‌కు అభిమానులే కాదు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా ఫిదా అయ్యారనడంలో అతిశయోక్తి కాదు. ఇక ఆర్సీబీ ఓపెనర్‌, టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి సూర్య ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత అతడిని అభినందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విజయ్‌ కుమార్‌ వైశాక్‌ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో సూర్యను హత్తుకున్న కోహ్లి.. అతడి వెన్నుతట్టి శుభాభినందనలు తెలిపాడు.

కాలం మారుతుంది.. మనసులు గెలుచుకుంది
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో గతంలో వీరిద్దరి మధ్య జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. ‘‘కాలం మారుతుంది.. ఏదేమైనా సూర్య పట్ల కోహ్లి ఆత్మీయత నిజంగా మా మనసులు గెలుచుకుంది’’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2020 సందర్భంగా కీలక మ్యాచ్‌లో ఆర్సీబీని ముంబై ఓడించడంలో సూర్య ప్రధాన పాత్ర పోషించాడు.

అప్పుడలా.. ఇప్పుడిలా
నాటి మ్యాచ్‌లో ఆ గెలుపుతో ఆ ఏడాది ముంబై ప్లే ఆఫ్స్‌ చేరింది. అయితే, దూకుడుగా ఆడుతున్న సూర్య దగ్గరకు వచ్చిన కోహ్లి అతడిని కవ్వించే ప్రయత్నం చేయగా.. సూర్య మిన్నకుండిపోయాడు. ఇక ఆ తర్వాత సూర్య టీమిండియాలోకి రావడం.. ఇద్దరూ కలిసి తమ అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు విజయాలు అందించడం తెలిసిందే.

తాజా వీడియో నేపథ్యంలో ఫ్యాన్స్‌ మరోసారి గత జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీతో మంగళవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు.

చదవండి: ఆ నలుగురు అద్భుతం.. ఎంతటి రిస్క్‌కైనా వెనుకాడటం లేదు: రోహిత్‌ శర్మ
ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ!

Advertisement
Advertisement