#Faf du Plessis On SKY: ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదు.. మేము కనీసం: డుప్లెసిస్‌

IPL 2023: Cant Shut Him Down Faf du Plessis Ultimate Praise For Suryakumar - Sakshi

IPL 2023 MI vs RCB: ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ప్రశంసలు కురిపించాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడి ఆపడం ఎవరితరం కాదని పేర్కొన్నాడు. స్కై ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని.. బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడని కొనియాడాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా ముంబైతో ఆర్సీబీ మంగళవారం తలపడిన విషయం తెలిసిందే.

ఉఫ్‌మని ఊదేసిన ముంబై
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో ముంబై 16.3 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు నష్టపోయి.. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. 

టీమిండియా టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇలా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డ సూర్య ముంబైకి మర్చిపోలేని విజయం అందించాడు.

కనీసం 20 పరుగులు చేసి ఉంటే
ఇక మెరుగైన స్కోరు నమోదు చేసిప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన ఆర్సీబీ.. 6 వికెట్ల తేడాతో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి దిగజారింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ సారథి ఫాఫ్‌ డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. తాము మరో 20 పరుగులు స్కోర్‌ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

‘‘వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ముంబై పటిష్ట జట్టు. అందులోనూ వారి సొంతమైదానం. మేము 20 పరుగులు చేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ముంబైలాంటి జట్టు ముందు భారీ లక్ష్యం ఉంచితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. నిజానికి ఆఖరి ఐదు ఓవర్లలో మేము సరిగా ఆడలేకపోయాం. 200 అనేది మెరుగైన స్కోరు అని చెప్పగలం. 


డుప్లెసిస్‌, సూర్య (PC: IPL)

అతడు అద్భుతం
మనకు మనం సర్దిచెప్పుకోవడానికి మాత్రమే అలా అనుకోవాల్సి ఉంటుంది! నిజానికి వాళ్లు మొదటి ఆరు ఓవర్ల(62/2)ను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా స్కై(సూర్య) బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అతడిని ఆపడం ఎవరితరం కాలేదు.

ఇక సిరాజ్‌ ఐపీఎల్‌ ఆరంభం నుంచి బాగానే బౌలింగ్‌ చేస్తున్నాడు. కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. బ్యాటర్లు కూడా ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది. పవర్‌ప్లేలో కనీసం 60 పరుగులు రాబడితేనే పోటీలో నిలవగలం’’ అని ఫాఫ్‌ డుప్లెసిస్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్లు సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌ పూర్తిగా తేలిపోయి విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

ఆర్సీబీ తరఫున 1000 పరుగులు
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ ఫాఫ్‌.. 5 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 65 పరుగులు సాధించాడు. ఆర్సీబీ తరఫు 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా గతేడాది బెంగళూరు సారథిగా పగ్గాలు చేపట్టిన ఫాఫ్‌ బ్యాటర్‌గానూ, కెప్టెన్‌గానూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి కేవలం ఒకే పరుగుకు పరిమితం కావడం కూడా ప్రభావం చూపింది.

చదవండి: Virat Kohli: చిల్లర వేషాలు మానుకో! లేదంటే ఐపీఎల్‌లోనే లేకుండా పోతావ్‌!  
MI Vs RCB: కాలం మారుతుంది! సూర్య అవుట్‌ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. వీడియో వైరల్‌ 
ఆర్సీబీకి పట్టిన దరిద్రం.. ఇకనైనా అతడిని వదిలేయండి! లేదంటే మీ కర్మ! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top