ఒలింపిక్స్‌ నుంచి బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ ఔట్‌!

IOC Says Weightlifting-Boxing Not Included From Los Angeles 2028 Olympics - Sakshi

మోడ్రన్‌ పెంటాథ్లాన్‌ను కూడా 2028 ఒలింపిక్స్‌ నుంచి తప్పించే అవకాశం

క్రికెట్‌కూ దక్కని చోటు

లాసానే (స్విట్జర్లాండ్‌): ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు అందించిన బాక్సింగ్, రెండు పతకాలు అందించిన వెయిట్‌లిఫ్టింగ్‌లకు విశ్వ క్రీడల్లో భవిష్యత్తు సందేహాత్మకంగా మారింది. 2028లో  లాస్‌ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ నుంచి ఈ క్రీడలను తప్పించే అవకాశం ఉంది. దీంతో పాటు ఐదు క్రీడాంశాల సమాహారమైన మోడ్రన్‌ పెంటాథ్లాన్‌ను (రన్నింగ్, ఈక్వెస్ట్రియన్, స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్‌) కూడా తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది.

దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా... మూడు కొత్త క్రీడాంశాల ప్రకటనను బట్టి చూస్తే పై మూడింటిని తప్పించాలని ఐఓసీ అంతర్గత సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటి స్థానాల్లో కొత్తగా స్కేట్‌ బోర్డింగ్, స్పోర్ట్‌ క్లైంబింగ్, సర్ఫింగ్‌లను చేర్చనున్నారు. యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో రెగ్యులర్‌ క్రీడాంశంగా మార్చేందుకు ఐఓసీ సిద్ధమైంది. 1912 ఒలింపిక్స్‌ నుంచి ఉన్న మోడ్రన్‌ పెంటాథ్లాన్‌కు చారిత్రక ప్రాధాన్యమే తప్ప వాణిజ్యపరంగా కానీ అభిమానులపరంగా పెద్దగా ఆసక్తి గానీ ఉండటం లేదని ఐఓసీ చెబుతోంది.

ఇక బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడలను సుదీర్ఘ కాలంగా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు, నైతికత లోపించడం, డోపింగ్, పరిపాలన సరిగా లేకపోవడంతో ఈ క్రీడల ప్రక్షాళన అవసరమని భావిస్తూ వీటిని తప్పించాలని ఐఓసీ ప్రతిపాదించింది. మరోవైపు 2028 నుంచి క్రికెట్‌ కూడా ఒలింపిక్స్‌లోకి రావచ్చంటూ వినిపించగా, తాజా పరిణామాలతో ఆ అవకాశం లేదని తేలిపో యింది. లాస్‌ ఏంజెలిస్‌ ఈవెంట్‌ కోసం నిర్వాహకులు ప్రతిపాదించిన 28 క్రీడాంశాల్లో క్రికెట్‌ పేరు లేకపోవడంతో దీనిపై స్పష్టత వచ్చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top