
వన్డే ప్రపంచకప్-2025 సన్నాహాకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. ఆదివారం ముల్లాన్‌పుర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో హర్మాన్ సేన పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.
టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు ప్రతీకా రావల్ (96 బంతుల్లో 64), స్మృతి మంధాన (63 బంతుల్లో 58) అర్ధ శతకాలతో సత్తాచాటగా.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54) కూడా హాఫ్ సెంచరీతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో మేగన్ షట్ రెండు వికెట్లు పడగొట్టగా.. కిమ్ గార్త్, అన్నాబెల్ సదర్‌లాండ్, అలనా కింగ్, తాహిలా మెగ్రాత్ తలా వికెట్ సాధించారు.
అదరగొట్టిన మూనీ, లిచ్‌ఫీల్డ్
అనంతరం 282 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.1 ఓవర్లలోనే చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఫోబీ లిచ్‌ఫీల్డ్(80 బంతుల్లో 14 ఫోర్లతో 88), బెత్‌మూనీ(74 బంతుల్లో 9 ఫోర్లతో 77 నాటౌట్), సదర్లాండ్(51 బంతుల్లో 54 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా ఒక్కో వికెట్ సాధించారు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్17న ముల్లాన్‌పుర్ వేదికగానే జరగనుంది.