
నేడు భారత్ తొలి మ్యాచ్
ఆసియా కప్‌లో యూఏఈతో పోరు
జోరు మీదున్న సూర్య బృందం
రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: ఆసియా కప్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించేందుకు భారత జట్టు సిద్ధమైంది. టోర్నీలో భాగంగా గ్రూప్ ‘ఎ’లో నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా... ఆతిథ్య జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడనుంది. డిఫెండింగ్ వరల్డ్‌కప్ చాంపియన్ కావడంతో పాటు అపార ఐపీఎల్ అనుభవంతో నిండిన సూర్యకుమార్ బృందానికి ఈ పోరులో విజయం లాంఛనమే.
అయితే మన తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ కానుంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా ఎదిగే దశలోనే ఉన్న యూఏఈ బలమైన ప్రత్యర్థికి ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. 2024లో విజేతగా నిలిచిన టి20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి చూస్తే భారత్ 24 మ్యాచ్‌లు గెలిచి, 3 మాత్రమే ఓడింది.
సామ్సన్ అవుట్!
టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పునరాగమనంతో టి20 టీమ్‌లో భారత్ తప్పనిసరి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ ఫార్మాట్‌లో అసాధారణ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేస్తాడు. మూడో స్థానంలో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న తిలక్ వర్మకు అదే స్థానంలో అవకాశం ఖాయం కాగా నాలుగో స్థానంలో కెపె్టన్ సూర్యకుమార్ ఉన్నాడు. దాంతో వికెట్ కీపర్‌గా సంజు సామ్సన్‌కు చాన్స్ దొరికే అవకాశం కనిపించడం లేదు.
సామ్సన్ సాధారణంగా టాపార్డర్ బ్యాటర్. టాప్–3లో ఆడకపోతే అతనికి చోటు అనవసరమని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మంగళవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను బట్టి చూసినా అదే కనిపించింది. సామ్సన్‌కంటే ఫినిషర్‌గా జితేశ్ శర్మ మెరుగైన ఆటగాడు కాబట్టి కీపర్‌గా అతను బరిలోకి దిగవచ్చు. పేస్ బౌలింగ్, విధ్వంసక బ్యాటింగ్ కలగలిపిన ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో జట్టు దుర్బేధ్యంగా ఉంది.
ప్రధాన పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్‌ల స్థానాలకు ఢోకా లేదు. మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఆడటంపై ఎలాంటి సందేహం లేదు. మిగిలిన ఏకైక స్థానం కోసం కుల్దీప్, వరుణ్ చక్రవర్తి మధ్య పోటీ ఉంది. అయితే టీమిండియాకు సంబంధించి తుది జట్టులో ఎవరు ఉన్నా అంతా విడివిడిగా మ్యాచ్ విన్నర్లు కాబట్టి సమస్య లేదు.
అనుభవలేమితో సమస్య...
సొంత మైదానంలో బరిలోకి దిగుతుండటం, ఇటీవలే ముక్కోణపు టోర్నీలో కూడా ఆడిన అనుభవం యూఏఈ జట్టుకు మానసికంగా కాస్త ఆత్మవిశ్వాసం పెంచే విషయం. అయితే భారత్‌లాంటి అత్యంత బలమైన జట్టును ఈ టీమ్ నిలువరించడం చాలా కష్టమైన విషయం. బుమ్రాలాంటి స్టార్‌ను ఎదుర్కొని పరుగులు సాధించడం వారి శక్తికి మించిన పని కావచ్చు. ఓపెనర్, కెప్టెన్ మొహమ్మద్ వసీమ్‌తో పాటు మరో ఓపెనర్ అలీషాన్‌పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది.

ఆసిఫ్ ఖాన్, రాహుల్ చోప్రా కూడా కొన్ని కీలక పరుగులు సాధించగల సమర్థులు. జునైద్ సిద్దిఖ్, రోహిద్, హైదర్ అలీ ప్రధాన బౌలర్లు కాగా...లెఫ్టార్మ్ స్పిన్నర్ సిమ్రన్‌జీత్ సింగ్ మరో కీలక బౌలర్. భారత మాజీ ఆటగాడు, 2007లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన లాల్‌చంద్ రాజ్‌పుత్ ఇప్పుడు యూఏఈ టీమ్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఆయన మార్గదర్శకత్వంలోనే టీమ్ ఇటీవల కాస్త మెరుగైంది.
1 భారత్, యూఏఈ మధ్య ఇప్పటి వరకు ఒకే ఒక టి20 మ్యాచ్ జరిగింది. 2016 ఆసియా కప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది.
పిచ్, వాతావరణం
చాంపియన్స్ ట్రోఫీ సమయంలో పిచ్‌ల పూర్తిగా పొడిబారి స్పిన్‌కు బాగా అనుకూలించాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ సీజన్‌లో కొత్తగా, జీవం ఉన్న పిచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అటు బ్యాటింగ్‌తో పాటు పేసర్లకు కూడా మంచి అవకాశం ఉంది. తీవ్రమైన ఎండల మధ్య ఆటగాళ్లు శ్రమించాల్సి ఉంటుంది.