అప్పుడు గెలిచిన విషయం మర్చిపోయారా? నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఘాటు వ్యాఖ్యలు

Indians need to shut up and get on with cricket: Ian Chappell - Sakshi

India vs Australia, 3rd Test: ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘోర పరజాయం చవి చూసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌పై పూర్తి అధిపత్యం చెలాయించిన భారత్‌.. మూడో టెస్టులో మాత్రం స్మిత్‌ వ్యూహాల ముందు చేతులెత్తేసింది.

ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైన రోహిత్‌ సేనపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సంచలన వాఖ్యలు చేశాడు. అనవసరపు మాటలు మాట్లాడకుండా.. క్రికెట్‌ పైన మాత్రమే దృష్టిపెట్టండని భారత జట్టు గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఆటపై దృష్టి పెట్టండి
"ఇండోర్‌ టెస్టులో టీమిండియా తాము చేసిన తప్పిదాలను ముందు తెలుసుకోవాలి. ఈ సిరీస్‌లో భారత జట్టుకు సరిపోయే పిచ్‌లను తయారు చేస్తున్నారని ఇంతకుముందే నేను చెప్పాను. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్‌లను గెలిచిన విషయాన్ని భారత్ మర్చిపోయిందా? అయినా.. పిచ్‌ గురించి క్యూరేటర్‌కి కాకుండా నిర్వాహకులు, ఆటగాళ్ళు, కోచ్‌లకు ఏంటి సంబంధం? పిచ్‌ను తయారు చేసే పనిని క్యూరేటర్‌ చూసుకుంటాడు.

అతడు ఏది మంచి ట్రాక్‌ అనుకుంటే అదే సిద్దం చేస్తాడు. ఆ ట్రాక్‌పైనే ఇరు జట్లను ఆడనివ్వండి. భారత్‌ తమకు కావాల్సినట్లుగా పిచ్ లను తయారు చేయమని అడిగితే మాత్రం నాకు ఆ జట్టుపై ఎటువంటి సానుభూతి ఉండదు. ఇప్పటికైన పిచ్‌ను తయారు చేసే పనిని క్యూరేటర్‌కు వదిలేయండి. భారత జట్టు నోరు మూసుకొని క్రికెట్‌పై దృష్టి సారిస్తే మంచిది.

అప్పుడు గెలిచారు కదా!
ఆస్ట్రేలియా పిచ్‌లపై వాళ్లు మంచి ఆల్రౌండ్ క్రికెట్‌తో ఏ విధంగా గెలిచారో మార్చిపోయారు అనుకుంటా. అందుకే ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే రిషబ్ పంత్ లేకపోవడం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి.

అతడు జట్టుకు ఎంత కీలకమో ఇప్పుడు భారత్‌కు తెలుస్తోంది" అని ఈఎస్‌ప్పీన్‌తో చాపెల్ పేర్కొన్నాడు. కాగా ఇండోర్‌ పిచ్‌కు ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్స్ విధించింది. పిచ్‌ను మరీ నాసిరకంగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఆసీస్‌-భారత్‌ మధ్య ఆఖరి టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా మార్చి9 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ఇయాన్‌ చాపెల్‌ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.

చదవండి: PSL 2023: ఆజాం ఖాన్‌ విధ్వంసం.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో! పాపం వసీం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top