
నేడు ఆస్ట్రేలియాతో భారత్ రెండో వన్డే
ఒత్తిడిలో గిల్ బృందం
ఉదయం 9 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
అడిలైడ్: శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో తొలి వన్డే ఓడిన భారత జట్టు మరో పోరులో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. ప్రస్తుతం 0–1తో వెనుకంజతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ను చేజార్చుకుంటుంది. వర్షం కారణంగా 26 ఓవర్లకే కుదించిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కొంది.
ఆ్రస్టేలియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. సహజంగానే మరోసారి అందరి దృష్టీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపైనే ఉంది. తొలి వన్డేలో వీరిద్దరు విఫలం కావడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రతీ మ్యాచ్ వీరికి పరీక్ష కాదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెబుతున్నా... కచి్చతంగా రాణించాల్సిన ఒత్తిడి వీరిపై ఉందనేది వాస్తవం. అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి తన ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నాడు.
భారత్ తుది జట్టు విషయంలో మార్పు ఉండకపోవచ్చు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్‌లలో ఒకరిని తప్పించి రెగ్యులర్ స్పిన్నర్ కుల్దీప్‌కు అవకాశం ఇస్తారా అనేది సందేహమే. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్‌లో ఫిలిప్స్, కునెమన్ స్థానాల్లో అలెక్స్ కేరీ, ఆడమ్ జంపా రావడం ఖాయమైంది. అడిలైడ్ మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం కావడంతో భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడిన గత రెండు వన్డేల్లో (2012, 2019) భారత జట్టే గెలిచింది.