
ప్రపంచ కప్ టోర్నీకి భారత పురుషుల హాకీ జట్టు అర్హత
ఆసియా కప్ ఫైనల్లో కొరియాపై 4–1తో విజయం
టోర్నీని అజేయంగా ముగించిన టీమిండియా
రాజ్‌గిర్ (బిహార్): మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలిన భారత పురుషుల హాకీ జట్టు అసలు సిసలు సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సొంతగడ్డపై జరిగిన ఆసియా కప్ టోర్నీలో హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 4–1 గోల్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టును ఓడించింది.
ఈ విజయంతో ఆసియా కప్ విజేత హోదాలో... భారత జట్టు వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచ కప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. కొరియాతో జరిగిన ఫైనల్లో భారత్ తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (28వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుఖ్‌జీత్ సింగ్ (1వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. కొరియా జట్టుకు డెయిన్ సన్ (51వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.
విజేతగా నిలిచిన భారత జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 3 లక్షల చొప్పున... సహాయక సిబ్బందికి రూ. 1 లక్ష 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. ఆసియా కప్‌ను అత్యధికంగా ఐదుసార్లు నెగ్గిన కొరియా జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఫైనల్లో భారత్ పక్కా వ్యూహంతో ఆడింది.
తొలి నిమిషం నుంచే సమన్వయంతో కదులుతూ దాడులు చేసింది. ఫలితంగా తొలి నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించగా... ఆతిథ్య జట్టు దాడులను అడ్డుకోవడంలోనే కొరియాకు సమయం సరిపోయింది. మ్యాచ్ మొత్తం భారత్ ఒకేతీరుగా ఆడటంతో కొరియాకు తేరుకునే అవకాశం లేకుండా పోయింది.
నాలుగు గోల్స్ సమర్పించుకున్నాక కొరియా ఖాతా తెరిచినా అప్పటికే ఆలస్యమైపోయింది. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు రెండు పెనాల్టీ కార్నర్‌లు రాగా ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను వృథా చేసింది. కొరియా జట్టుకు లభించిన మూడు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని గోల్‌గా మలిచింది. అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మలేసియా 4–1తో చైనాపై గెలిచింది.
4: ఆసియా కప్ టైటిల్ సాధించడం భారత్‌కిది నాలుగోసారి. గతంలో భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచింది. కొరియా అత్యధికంగా ఐదుసార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది.
164: తాజా ఆసియా కప్‌లో నమోదైన మొత్తం గోల్స్. ఇందులో 97 ఫీల్డ్ గోల్స్ కాగా... 59 పెనాల్టీ కార్నర్‌ల ద్వారా, 8 పెనాల్టీ స్ట్రోక్‌ల ద్వారా వచ్చాయి. మలేసియా ప్లేయర్ అఖీముల్లా 12 గోల్స్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున అభిõÙక్, హర్మన్‌ప్రీత్, సుఖ్‌జీత్ 6 గోల్స్ చొప్పున చేశారు.
39: తాజా ఆసియా కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా భారత్ (39) నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది.