క్రికెట్‌ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ | Indian Captain Rohit Sharma Announces RETIREMENT From Test Cricket With Immediate Effect | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్‌ ప్రకటించిన రోహిత్‌ శర్మ

May 7 2025 7:47 PM | Updated on May 7 2025 8:19 PM

Indian Captain Rohit Sharma Announces RETIREMENT From Test Cricket With Immediate Effect

టీమిండియా అభిమానులకు గుండె పగిలే వార్త. రోహిత్‌ శర్మ టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హిట్‌మ్యాన్‌ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు.  తన రిటైర్మెంట్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్‌ పేర్కొన్నాడు. రోహిత్‌ తన రిటైర్మెంట్‌ ప్రకటనలో ఇలా రాసుకొచ్చాడు. 

"అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం  చాలా గౌరవంగా ఉంది. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతాను"

38 ఏళ్ల రోహిత్‌ భారత్‌ తరఫున 67 టెస్ట్‌లు ఆడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్‌ కోహ్లి నుంచి టెస్ట్‌ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్‌.. 24 టెస్ట్‌ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. 

ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. రోహిత్‌ తర్వాత టీమిం‍డియా తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్‌మన్‌ గిల్‌ ముందున్నాడు. రోహిత్‌ గతేడాది పొట్టి ప్రపంచకప్‌ తర్వాత టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో రోహిత్‌ భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. 

ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో రోహిత్‌ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. గత 10 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్‌ ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రోహిత్‌ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో రోహిత్‌ స్వతాహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.

అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లోనూ రోహిత్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవల​ం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ రెండు సిరీస్‌ల్లో రోహిత్‌ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్‌లను భారత్‌ కోల్పోయింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement