లాక్రాస్‌లో భారత్‌ లాజవాబ్‌!.. అసలు ఈ ఆట ఏంటి? | India won Two gold medals at the Asian meet | Sakshi
Sakshi News home page

లాక్రాస్‌లో భారత్‌ లాజవాబ్‌!.. అసలు ఈ ఆట ఏంటి?

Mar 26 2026 1:57 AM | Updated on Mar 26 2026 12:19 PM

India won Two gold medals at the Asian meet

ఆసియా మీట్‌లో రెండు స్వర్ణాలు

పురుషుల, మహిళల విభాగాల్లో అగ్రస్థానం

పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తెలంగాణ ప్లేయర్‌ అనుదీప్‌ రెడ్డి 

కేంద్ర క్రీడా మంత్రి మాండవీయ అభినందన

2028 ఒలింపిక్స్‌ అర్హతే లక్ష్యంగా కసరత్తు 

న్యూఢిల్లీ: ఆసియా మీట్‌లో పసిడి పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల లాక్రాస్‌ జట్లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా బుధవారం అభినందించారు. సుదీర్ఘ విరామం అనంతరం 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో పునరాగమనం చేయనున్న ఈ క్రీడలో భారత జట్లు సత్తా చాటాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. సౌదీ అరేబియాలోని రియాద్‌ వేదికగా... అసియా లాక్రాస్‌ గేమ్స్‌లో భారత జట్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాయి. 

పురుషుల ఫైనల్లో భారత జట్టు ఇరాక్‌పై గెలుపొందగా... మహిళల తుదిపోరులో పాకిస్తాన్‌ను భారత్‌ చిత్తుచేసి విజేతగా నిలిచింది. 2024లో భారత మహిళల జట్టు ఈ క్రీడలో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... గతేడాది పరుషుల జట్టు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడింది. అనతి కాలంలోనే నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న మన జట్లు... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడా మంత్రి ఆకాంక్షించారు.  ‘భారత్‌లో లాక్రాస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రీడకు మంచి భవిష్యత్తు ఉంది. 

ఈ క్రీడలో ఆసియా స్థాయిలో భారత్‌కు స్వర్ణం దక్కడం ఇదే తొలిసారి. ఇది మన జట్ల కృషి, పట్టుదలకు నిదర్శనం. ఇక 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందడుగు వేయాలి’ అని మాండవీయా అన్నారు. 1904 ఒలింపిక్స్‌లో ఈ ఆటను తొలిసారి విశ్వక్రీడల్లో ప్రవేశ పెట్టారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఇది పతక క్రీడగా కొనసాగింది. ఆ తర్వాత విశ్వక్రీడల జాబితా నుంచి లాక్రాస్‌ను తొలగించారు. 1928, 1932, 1948లో జరిగిన ఒలింపిక్స్‌లో లాక్రాస్‌ను ప్రదర్శన క్రీడగా నిర్వహించారు. 

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అమెరికా వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో ఈ ఆట దర్శనమివ్వనుంది. 2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత పురుషుల, మహిళల జట్లు... త్వరలో చైనా వేదికగా జరగనున్న ఆసియన్‌ లాక్రాస్‌ గేమ్స్‌లో పాల్గొననున్నాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా వేదికగా జరగనున్న ఆసియా–పసిఫిక్‌ చాంపియన్‌షిప్‌లోనూ పోటీపడతాయి. భారత పురుషుల లాక్రస్‌ జట్టుకు తెలంగాణ ప్లేయర్‌ అనుదీప్‌ రెడ్డి సారథిగా వ్యవహరిస్తుండగా... ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, తమిళనాడు, ఒడిశా, అస్సాం, జమ్మూకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్లేయర్లు జట్టులో ఉన్నారు.   

అసలు ఏంటీ లాక్రాస్‌... 
ఈ ఆటకు అమెరికాలో ఆదరణ ఎక్కువ. హాకీ, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌ కలగలిపినట్లు ఉండే ఈ ఆటలో... ఒక్కో జట్టు తరఫున 10 మంది పోటీ పడతారు. కాకపోతే ఒలింపిక్స్‌లో ఆడే జట్టులో మాత్రం ఆరుగురు ప్లేయర్లే ఉంటారు. హాకీ స్టిక్‌ లాంటి పొడవైన కర్ర పై భాగంలో ప్రత్యేక నెట్‌ ఉంటుంది. రబ్బర్‌ బంతిని పట్టుకోవడానికి సహచరులకు పాస్‌ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 

ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌లో ఎక్కువసార్లు ఎవరు బంతిని పంపగలిగితే వారు విజేతగా నిలుస్తారు. అచ్చం ఫుట్‌బాల్‌ మాదిరిగానే అటాకర్స్, మిడ్‌ఫీల్డర్స్, డిఫెండర్స్, గోలీ (గోల్‌ కీపర్‌) స్థానాలు ఉంటాయి. ప్లేయర్లు గాయపడే అవకాశముండటంతో... మైదానంలో ఉన్నవాళ్లంతా హెల్మెట్‌లు, గ్లౌవ్స్, ప్యాడ్స్‌ ధరించి బరిలోకి దిగుతారు.

Advertisement
 
Advertisement
Advertisement