SA vs IND: చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా?

India will take on South Africa in the final ODI today - Sakshi

నేడు దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో భారత్‌ పోరు 

మ.గం. 2 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

కేప్‌టౌన్‌: అలసిన శరీరాలు, పరుగులో తగ్గిన చురుకుదనం, మైదానంలో ఏమాత్రం కనిపించని ఉత్సాహం... శుక్రవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఓటమి దిశగా వెళుతున్న సమయంలో భారత ఆటగాళ్ల పరిస్థితి ఇది! దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టినప్పుడు, ఆ తర్వాత తొలి టెస్టులో ఘన విజయం సాధించినప్పుడు చూస్తే  టీమిండియా సభ్యుల్లో ఆకాశాన్ని తాకిన ఆత్మవిశ్వాసం, అమితోత్సాహం కనిపించాయి. ఇక పర్యటన చివరకు వచ్చే సరికి అంతా మారిపోయింది.

ఎప్పుడు సిరీస్‌ ముగించి స్వదేశం వెళదామా అన్నట్లుగా కనిపిస్తోంది. బయో బబుల్‌ ఒక కారణం కాగా...ఫేవరెట్‌గా బరిలోకి దిగి అనూహ్యంగా ఎదురైన పరాజయాలు భారత ఆటగాళ్లను నిస్సత్తువగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 0–2తో సిరీస్‌ కోల్పోయిన భారత్‌ చివరిదైన ఈ మూడో మ్యాచ్‌లోనైనా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఒక విజయాన్ని నమోదు చేస్తుందా లేక ఓటమితో టూర్‌ను ముగిస్తుందా అనేది చూడాలి.

రెండు వన్డేల్లోనూ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ ఏమాత్రం ఆకట్టుకోకపోగా...హెడ్‌ కోచ్‌గా ప్రధాన ఆటగాళ్లతో తొలి పర్యటనలోనే రాహుల్‌ ద్రవిడ్‌కు కూడా సంతృప్తికర ఫలితం దక్కలేదు. చివరి మ్యాచ్‌లో భారత్‌ పలు మార్పులతో బరిలోకి దిగవచ్చు. ప్రధాన పేసర్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో సిరాజ్‌ను ఆడించే అవకాశం ఉండగా... రెండు మ్యాచ్‌లలోనూ ఘోరంగా విఫలమైన భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో దీపక్‌ చహర్‌ను, వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను తీసుకునే చాన్స్‌ ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top