జడేజా ‘కత్తి’ దూశాడు!

India vs Sri Lanka Test : Sri Lanka 4 Down At Stumps, Trail India By 466 Runs - Sakshi

175 పరుగులతో అజేయంగా నిలిచిన ఆల్‌రౌండర్‌

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 574/8 డిక్లేర్డ్‌

శ్రీలంక 108/4

రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్‌కు శ్రీలంక కకావికలమైంది. గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన అతను తొలి మ్యాచ్‌లోనే తన విలువేంటో చూపించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా మెరుపు ప్రదర్శనతో శతకం బాదడంతో పాటు బౌలింగ్‌లో కీలక వికెట్‌ తీసి రెండో రోజే మ్యాచ్‌ను భారత్‌ చేతుల్లోకి తెచ్చాడు. అశ్విన్‌ కూడా ఇదే తరహా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థి పని పట్టాడు. అటు పేలవ బౌలింగ్, ఫీల్డింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసిన లంక బ్యాటింగ్‌లోనూ తడబడి అప్పుడే నాలుగు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. లంకను ఎక్కువ ఓవర్లు ఆడించే క్రమంలో జడేజా డబుల్‌ సెంచరీకి అవకాశం ఇవ్వకుండా భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడమే రెండో రోజు ఆటలో కాస్త చర్చనీయాంశం!

మొహాలి: శ్రీలంకతో తొలి టెస్టులో రెండో రోజే భారత్‌కు మ్యాచ్‌పై పట్టు చిక్కింది. ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో ఆట కొనసాగించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 129.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రవీంద్ర జడేజా (228 బంతుల్లో 175 నాటౌట్‌; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు సాధించగా, అశ్విన్‌ (82 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 130 పరుగులు జత చేశారు. అనంతరం లంక ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 466 పరుగులు వెనుకబడి ఉంది.  

భారీ భాగస్వామ్యం...
తొలి రోజు అజేయంగా నిలిచిన జడేజా, అశ్విన్‌ ద్వయం శనివారం అదే జోరును కొనసాగిస్తూ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో ఓవర్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జడేజాకు అశ్విన్‌ అండగా నిలిచాడు. వీరిద్దరూ వన్డే తరహాలో ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఫెర్నాండో ఓవర్లో జడేజా రెండు ఫోర్లు కొట్టడంతో స్కోరు 400 పరుగులకు చేరింది. ఆ తర్వాత అశ్విన్‌ హాఫ్‌ సెంచరీ కూడా పూర్తయింది. తొలి సెషన్‌లో అశ్విన్‌ వికెట్‌ కోల్పోయినా... 27 ఓవర్లలో భారత్‌ ఏకంగా 111 పరుగులు నమోదు చేసింది. ఎంబుల్డెనియా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 160 బంతుల్లో జడేజా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. లంచ్‌ విరామం తర్వాత కొద్ది సేపటికే జయంత్‌ యాదవ్‌ (2) వెనుదిరిగాడు. ఈ స్థితిలో జడేజా స్కోరు 104 పరుగులు. ఆ తర్వాత జడేజా మరింత చెలరేగిపోయాడు.

60 బంతుల్లోనే తర్వాతి 71 పరుగులు సాధించాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం ఎంబుల్డెనియా ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదాడు. డిసిల్వా బౌలింగ్‌లో మరో భారీ సిక్స్‌తో అతను 150 పరుగులకు చేరుకున్నాడు. షమీ (20 నాటౌట్‌) అతనికి చక్కగా సహకరించాడు. వీరిద్దరు 94 బంతుల్లోనే 103 పరుగులు జోడించగా జడేజానే 71 పరుగులు చేశాడు. అయితే డబుల్‌ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో అనూహ్యంగా భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.  శ్రీలంక ఓపెనర్లు కరుణరత్నే, తిరిమన్నె 18 ఓవర్ల పాటు భారత బౌలర్లను నిరోధించారు. అనంతరం అశ్విన్‌ బౌలింగ్‌లో తిరిమన్నె వికెట్ల ముందు దొరికిపోవడంతో పతనం మొదలైంది. ఆ తర్వాత కరుణరత్నేను జడేజా... మాథ్యూస్‌ (22)ను బుమ్రా... ధనంజయ డిసిల్వా (1)ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించారు.

హ్యాడ్లీని దాటిన అశ్విన్‌
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్‌ దిగ్గజం రిచర్‌ హ్యాడ్లీ (431)ను అశ్విన్‌ అధిగమించాడు. ప్రస్తుతం 432 వికెట్లతో అతను ఓవరాల్‌గా 11వ స్థానానికి చేరుకున్నాడు. మరో 3 వికెట్లు తీస్తే కపిల్‌దేవ్‌ (434)ను అశ్విన్‌ దాటుతాడు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 33; రోహిత్‌ (సి) లక్మల్‌ (బి) కుమార 29; విహారి (బి) ఫెర్నాండో 58; కోహ్లి (బి) ఎంబుల్డెనియా 45; పంత్‌ (బి) లక్మల్‌ 96; శ్రేయస్‌ (ఎల్బీ) (బి) డిసిల్వా 27; జడేజా (నాటౌట్‌) 175; అశ్విన్‌ (సి) డిక్‌వెలా (బి) లక్మల్‌ 61; జయంత్‌ (సి) తిరిమన్నె (బి) ఫెర్నాండో 2; షమీ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 28; మొత్తం (129.2 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్డ్‌) 574.  వికెట్ల పతనం: 1–52, 2–80, 3–170, 4–175, 5–228, 6–332, 7–462, 8–471.
బౌలింగ్‌: లక్మల్‌ 25–1–90–2, ఫెర్నాండో 26–1–135–2, కుమార 10.5–1–52–1, ఎంబుల్డెనియా 46–3–188–2, డిసిల్వా 18.2–1–79–1, అసలంక 3.1–0–14–0.  

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: కరుణరత్నే (ఎల్బీ) (బి) జడేజా 28; తిరిమన్నె (ఎల్బీ) (బి) అశ్విన్‌ 17; నిసాంక (బ్యాటింగ్‌) 26; మాథ్యూస్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 22; డిసిల్వా (ఎల్బీ) (బి) అశ్విన్‌ 1; అసలంక (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్లకు) 108.
వికెట్ల పతనం: 1–48, 2–59, 3–96, 4–103.
బౌలింగ్‌: 7–3–17–0, బుమ్రా 9–2–20–1, అశ్విన్‌ 13–6–21–2, జయంత్‌ 5–2–14–0, జడేజా 9–3–30–1.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top