India vs Australia Warm-Up Match: షమీ అద్భుతం

India vs Australia Warm-Up Match: India beat Australia by six runs - Sakshi

ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత్‌ను గెలిపించిన పేస్‌ బౌలర్‌

కోహ్లి కళ్లు చెదిరే ఫీల్డింగ్‌

రాహుల్, సూర్యకుమార్‌ మెరుపులు

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ పరాజయం

బ్రిస్బేన్‌: ఇది ప్రాక్టీస్‌ మ్యాచే! గెలిస్తే పాయింట్లేమీ రావు. ఓడినా నష్టం లేదు! కానీ అద్భుతమైన ముగింపుతో క్రికెట్‌ ప్రేక్షకుల్ని మురిపించింది. ఫీల్డింగ్‌లో కోహ్లి మెరుపులు... షమీ ఆఖరి ఓవర్‌ నిప్పులతో భారత్‌ అనూహ్యంగా గెలిచింది. చేతిలో 4 వికెట్లున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా 6 బంతుల్లో 11 పరుగులు చేయలేక ఆలౌటైంది. మొత్తానికి టీమిండియా తొలి వార్మప్‌ మ్యాచ్‌ అదిరింది. భారత్‌ 6 పరుగుల తేడాతో గెలిచింది. మొదట భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.

ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) దంచేశారు. కేన్‌ రిచర్డ్‌సన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్‌ ఫించ్‌ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) గెలుపు తీరాలకు తెచ్చినా... ఇన్నింగ్స్‌ మొత్తంలో ఒకే ఒక్క ఓవర్‌ వేసిన షమీ పేస్‌ (1–0–4–3)కు ఆసీస్‌ ఓడిపోయింది. ఆసీస్‌ చివరి ఆరు వికెట్లను తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయింది. భారత్‌ తమ రెండో వార్మప్‌ మ్యాచ్‌ను బుధవారం న్యూజిలాండ్‌తో ఆడుతుంది.  

రాహుల్‌ ధనాధన్‌
ఓపెనర్‌ రాహుల్‌ తొలి ఓవర్‌ నుంచే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అతను కమిన్స్‌ వేసిన నాలుగో ఓవర్‌ను దంచి     కొట్టాడు. 6 బంతుల్ని రాహులే ఎదుర్కొని 4, 0, 6, 4, 2, 4లతో 20 పరుగులు చేశాడు. 4 ఓవర్లయినా కెప్టెన్‌ రోహిత్‌ (2 బంతులే ఆడాడు) ఖాతా తెరువలేదు. జట్టు స్కోరేమో 47/0. ఇందులో రాహుల్‌వే 43 పరుగులు! 27 బంతుల్లో (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

కాసేపటికే అతను అవుట్‌కాగా,  6, 4తో టచ్‌లోకి వచ్చిన రోహిత్‌ (15; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా నిష్క్రమించాడు. 10 ఓవర్లలో భారత్‌ 89/2 స్కోరు చేసింది. వేగంగా ఆడే ప్రయత్నంలో కోహ్లి (13 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్‌), చెత్త షాట్‌తో హార్దిక్‌ పాండ్యా (2) అవుటయ్యారు. కాసేపటికే దినేశ్‌ కార్తీక్‌ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌) జోరుకు బ్రేక్‌ పడగా, కమిన్స్, స్టార్క్‌లను అవలీలగా ఎదుర్కొన్న సూర్య ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో 32 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు.  

ఫించ్‌ పోరాటం
భారత్‌ నిర్దేశించిన లక్ష్యఛేదనకు దీటుగానే ఆసీస్‌ పరుగుల వేట సాగింది. ఓపెనర్లు మార్‌‡్ష (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్‌ ధాటిగా ఆడారు. 5.3 ఓవర్లలో ఓపెనింగ్‌ వికెట్‌కు 64 పరుగులు జోడించారు. కానీ తర్వాతి బంతికి మార్‌‡్షను భువనేశ్వర్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే ఫించ్‌ జోరు మాత్రం కొనసాగింది. స్మిత్‌ (11), మ్యాక్స్‌వెల్‌ (16 బంతుల్లో 23; 4 ఫోర్లు), స్టొయినిస్‌ (7)లతో కలిసి ఫించ్‌ జట్టును 19వ ఓవర్‌దాకా గెలుపు వైపు మళ్లించాడు.

ఆ ఓవర్‌ తొలి బంతికి హర్షల్‌ అతన్ని క్లీన్‌బౌ ల్డ్‌ చేయగా, మరుసటి బంతికి టిమ్‌ డేవిడ్‌ (5)ను కోహ్లి మెరుపు వేగంతో డైరెక్ట్‌ త్రోతో రనౌట్‌ చేశాడు. 19 ఓవర్ల దాకా విశ్రాంతినిచ్చిన షమీకి ఆఖరి ఓవర్‌ అప్పగించారు. అదే అతని తొలి ఓవర్‌ కాగా తొలి 2 బంతులకు 4 పరుగులిచ్చాడు. తర్వాత నాలుగు బంతుల్లో వికెట్లు రాలాయి. కమిన్స్‌ (7) షాట్‌కు లాంగాన్‌లో సిక్సర్‌గా వెళ్లే బంతిని కోహ్లి ఒంటిచేత్తో గాల్లో అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌. అగర్‌ (0) రనౌట్‌ కాగా, షమీ యార్కర్లతో ఇంగ్లిస్‌ (1), రిచర్డ్‌సన్‌ (0)లను బౌల్డ్‌ చేశాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top