నంబర్‌ వన్‌గా టీమిండియా | India on top of latest ICC ODI rankings | Sakshi
Sakshi News home page

నంబర్‌ వన్‌గా టీమిండియా

May 12 2026 11:44 AM | Updated on May 12 2026 12:07 PM

India on top of latest ICC ODI rankings

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్‌ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 118 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతుంది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో పాటు ద్వైపాక్షిక సిరీస్‌ల విజయాలు భారత జట్టు టాప్‌ ప్లేస్‌ నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే గత ర్యాంకింగ్‌తో పోలిస్తే భారత్ ఒక రేటింగ్ పాయింట్ కోల్పోయింది. అయినా మిగతా జట్లపై మాత్రం స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.

తాజా ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్‌ 113 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కివీస్ జట్టు గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది. ఇక ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఇటీవల జరిగిన సిరీస్‌లలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ భారత్‌ను అధిగమించలేకపోయింది.

ఈసారి ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పుగా సౌతాఫ్రికా జట్టు టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చింది. 102 పాయింట్లతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి చేరగా, పాకిస్తాన్‌ 98 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. ప్రోటీస్ జట్టు ఇటీవల వన్డే ఫార్మాట్‌లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో నాలుగో స్థానానికి ఎగబాకింది.

ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక (96), ఆఫ్ఘనిస్తాన్‌ (93), ఇంగ్లండ్‌ (89), బంగ్లాదేశ్‌ (84),  వెస్టిండీస్‌ (74) ఉన్నాయి.

ఈ ర్యాంకింగ్స్‌కు మరో ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. వరల్డ్‌కప్‌ 2027కు నేరుగా అర్హత సాధించే జట్లను నిర్ణయించడంలో ఇవి కీలకంగా మారనున్నాయి. 2027 మార్చి 31 నాటికి టాప్-8లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే ఆటోమేటిక్ అర్హత పొందాయి.

దీంతో ప్రస్తుతం టాప్-8లో కొనసాగుతున్న జట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లు తమ స్థానాన్ని కాపాడుకునేందుకు కీలక సిరీస్‌లపై దృష్టి పెట్టనున్నాయి. భారత్ మాత్రం ప్రపంచ నంబర్‌వన్ జట్టుగా మరోసారి తన ఆధిపత్యాన్ని  చాటింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement