భారత టెస్ట్‌ జట్టులో మార్పులు.. ఐపీఎల్‌ స్టార్లకు ప్రత్యేక అవకాశం | India Test Squad vs Afghanistan Undergoes Modifications, IPL Stars Heavily Added | Sakshi
Sakshi News home page

భారత టెస్ట్‌ జట్టులో మార్పులు.. ఐపీఎల్‌ స్టార్లకు ప్రత్యేక అవకాశం

Jun 2 2026 5:03 PM | Updated on Jun 2 2026 5:07 PM

India Test Squad vs Afghanistan Undergoes Modifications, IPL Stars Heavily Added

త్వరలో (జూన్‌ 6 నుంచి) ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం ఎంపిక​ చేసిన భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జట్టుకు అదనంగా ఆరుగురు ప్లేయర్లను భారత సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో ​కొందరు ఐపీఎల్‌ 2026లో సత్తా చాటిన బౌలర్లు. వీరిని మెయిన్‌ జట్టులో కాకుండా నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేశారు.

బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. గుర్జప్నీత్‌ సింగ్‌, ఆకిబ్‌ నబీ, ప్రిన్స్‌ యాదవ్‌, సరాన్ష్‌ జైన్‌, జీషన్‌ అన్సారీ, శివాంగ్‌ కుమార్‌ ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం భారత జట్టు నెట్‌ బౌలర్లుగా ఎంపికయ్యారు. వీరు ప్రధాన జట్టులో సభ్యులు కాకపోయినా, భారత బ్యాటర్లకు నెట్‌ ప్రాక్టీస్‌లో సహాయపడతారు.

పై బౌలర్లను టీమిండియా నెట్‌ బౌలర్లుగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్‌ 2026 వల్ల రెగ్యులర్‌ బౌలర్లపై పడిన శారీరక ఒత్తిడి అని తెలుస్తోంది. ఫైనల్‌ వరకు ఆడిన మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, మానవ్‌ సుతార్‌, గుర్నూర్‌ బ్రార్‌ (రెగ్యులర్‌ జట్టు సభ్యులు) శారీరక అలసట కారణంగా ప్రాక్టీస్‌ సెషన్స్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్యాటర్లకు సరైన ప్రాక్టీస్‌ కల్పించేందుకు అదనపు బౌలర్లను ఎంపిక చేశారు.

అయితే ఈ ఎంపికలను కేవలం నెట్‌ బౌలర్ల అవసరంగా మాత్రమే చూడడం లేదు. భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బౌలర్లను దగ్గరగా పరిశీలించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జట్టుతో కలిసి శిక్షణ పొందడం ద్వారా అంతర్జాతీయ స్థాయి వాతావరణాన్ని అర్థం చేసుకునే అవకాశం వీరికి లభించనుంది.

ఈ ఆరుగురిలో కొందరు దేశీయ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆకిబ్‌ నబీ దేశీయ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అలాగే జీషన్‌ అన్సారీ తన లెగ్‌స్పిన్‌తో మంచి పేరు సంపాదించాడు. గుర్జప్నీత్‌ సింగ్‌, సరాన్ష్‌‌ జైన్‌ కూడా రెడ్‌బాల్‌ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనలు చేశారు.

ప్రిన్స్‌ యాదవ్‌, శివాంగ్‌ కుమార్‌లకు ఐపీఎల్‌ 2026 ప్రదర్శనలు ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ప్రిన్స్‌ యాదవ్‌ తన వేగం, క్రమశిక్షణతో ఆకట్టుకుని ఇప్పటికే అఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో చోటు సంపాదించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టే ముందు భారత జట్టు డ్రెస్సింగ్‌రూమ్‌ వాతావరణాన్ని అనుభవించడం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఆరుగురి ఎంపికను భవిష్యత్‌ భారత టెస్టు జట్టు నిర్మాణంలో ఒక కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్‌ టెస్టులో ప్రత్యక్షంగా ఆడే అవకాశం లేకపోయినా, జట్టుతో కలిసి పనిచేసే ఈ అనుభవం వారి కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశముంది.

ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌ కోసం భారత రెగ్యులర్‌ జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్‌ పంత్, దేవ్‌దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్‌ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్‌ జురెల్‌, హర్ష్‌ దూబే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement