దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 సిరీస్ కోల్పోయినా... ప్రపంచకప్‌నకు ముందు విలువైన పాఠాలు నేర్చుకుందని హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 1–4తో సిరీస్ కోల్పోయింది.
ఈ నేపథ్యంలో మజుందార్ మాట్లాడుతూ... ‘సిరీస్ చాలా బాగా సాగింది. ప్రతి మ్యాచ్‌లో మన అమ్మాయిలు బాగా పోరాడారు. ఫలితం అనుకూలంగా రాలేదు. 1–4తో సిరీస్ కోల్పోవడం కాస్త నిరాశ పరిచింది.
అయితే ఈ సిరీస్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మంచి ఆరంభాలు లభించిన తర్వాత వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాం. ఈ అంశంపై మరింత కృషి చేయాల్సిన అవసరముంది.
ఇక ప్రత్యర్థి బ్యాటర్లను పవర్ ప్లేలో కట్టడి చేయలేకపోయాం. దాని వల్లే మ్యాచ్‌ల్లో పైచేయి సాధ్యపడలేదు. పొరబాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.
సిరీస్ గెలిచేందుకు దక్షిణాఫ్రికా జట్టుకు పూర్తి అర్హత ఉంది. ముఖ్యంగా సఫారీ జట్టు కెప్టెన్ లౌరా వోల్‌వార్ట్ అద్భుత ఆటతీరు కనబర్చింది. ఐదు మ్యాచ్‌ల్లో వోల్‌వార్ట్ వరుసగా 51, 54, 115, 18, 92 పరుగులు చేసింది’ అని వివరించాడు.


