SA vs IND: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు

India Predicted XI For 2nd Test vs South Africa - Sakshi

నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు

రెట్టించిన ఉత్సాహంతో కోహ్లి బృందం

డీలాపడిన సఫారీ జట్టు

మ్యాచ్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు

మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

‘టీమిండియా ఇంట్లో పులి... విదేశాల్లో పిల్లి’ అనే వ్యాఖ్య ఏళ్ల తరబడి భారత క్రికెట్‌ జట్టు ఘనవిజయాలను తక్కువ చేసేది. ఇప్పుడదే విమర్శకులు ‘భారత్‌ ఇంట్లో పులి... విదేశాల్లో బెబ్బులి’ అనే స్థాయికి టీమిండియా ఎదిగింది. ఇదంతా ఒక్క రోజులో రాలేదు. ఒకరిద్దరితో సాకారమవ్వలేదు. భారత్‌ పేసర్లు మన స్పిన్నర్లకు దీటుగా కొన్నేళ్లుగా శ్రమించడం వల్లే సాధ్యమైంది. ఇప్పుడు కూడా పేసర్ల ప్రతాపంతో ‘వాండరర్స్‌’లో ఈ ఒక్కటీ గెలిస్తే భారత టెస్టు చరిత్ర ఘనచరితగా మారనుంది. అంతర్జాతీయ టెస్టుల్లో విదేశీ పర్యటనల్లో అన్నింటా టెస్టు సిరీస్‌లు సాధించిన జట్టుగా నిలువనుంది.  

జొహన్నెస్‌బర్గ్‌: టెస్టుల్లో ‘గ్రేటెస్ట్‌’ అయ్యే అరుదైన అవకాశం కోహ్లి సేన ముందర ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)కు మించిన చరిత్ర లిఖించేందుకు ఒకే ఒక్క గెలుపు చాలు. ఈ దెబ్బకు సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ విజయమే కాదు... ప్రపంచ టెస్టు చరిత్రలో అన్ని దేశాలపై వారి సొంతగడ్డపై సిరీస్‌ విజయం సాధించిన అద్వితీయ రికార్డును భారత జట్టు సొంతం చేసుకుంటుంది.

ఇంతకుముందే ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ సహా ఆస్ట్రేలియాను కంగారూ పెట్టించినప్పటికీ దక్షిణాఫ్రికాపై మాత్రం దశాబ్దాలుగా సమర శంఖం పూరిస్తున్నా గెలిచే అవకాశం టీమిండియాకు దక్కలేదు. ఇప్పుడా సువర్ణావకాశం చేజిక్కించుకునేందుకు వాండరర్స్‌ మైదానం ఆహ్వానిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం నుంచి రెండో టెస్టు జరుగుతుంది. ఇందులో విరాట్‌ సేన విజయం సాధిస్తే మూడో టెస్టు దాకా సిరీస్‌ ఫలితం కోసం ఎదురు చూడాల్సిన పనే ఉండదు. సిరీస్‌ విజేతగా మరో చరిత్రను ఇక్కడే లిఖించవచ్చు.

ఆత్మ విశ్వాసంతో భారత్‌...
తొలి టెస్టు విజయం, సీమర్ల బలం భారత్‌ను పటిష్టస్థితిలో నిలిపింది. అలాగని బ్యాటింగ్‌లో తక్కువేం లేదు. కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌ల ఓపెనింగ్‌ జోడీకి ఫామ్‌లోకి వచ్చిన రహానే అనుభవం తోడయ్యింది. దీంతో భారత్‌ జట్టులో కండబలమే కాదు... గుండె బలం కూడా పెరిగిందని గట్టిగా చెప్పొచ్చు. పైగా వాండరర్స్‌లో ఏన్నడూ ఒడింది కూడా లేదు. ఇక్కడ ఐదు మ్యాచ్‌లాడిన భారత్‌ రెండు గెలిచి, మరో మూడు టెస్టుల్ని ‘డ్రా’గా ముగించింది. ఈ నేపథ్యంలో 2022 ఏడాదిలో కూడా మనకు శుభారంభం ఖాయమనుకోవచ్చు.

ముఖ్యంగా బౌలింగ్‌ దళం మునుపెన్నడూ లేనంత దుర్భేద్యంగా తయారైంది. ఇంటాబయటా... వేదిక ఏదైనా మన పేసర్లకు ఎదురే లేకుండా పోతోంది. హైదరాబాదీ సీమర్‌ సిరాజ్‌... అనుభవజ్ఞులైన షమీ, బుమ్రాలతో పోటీపడి మరీ కీలక వికెట్లను పడగొట్టడం టీమిండియా సంతోషాన్ని రెట్టింపు చేసింది. బ్యాటింగ్‌లో కోహ్లి, పుజారా, రిషభ్‌ పంత్‌లు రాణిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకుండదు. కానీ ఇక్కడ ప్రత్యర్థి కంటే వాతావరణంతోనే సమస్య ఎదురుకానుంది. టెస్ట్‌ జరిగే ఐదు రోజుల్లో నాలుగు రోజులపాటు వర్షం ముప్పు పొంచి ఉండటం కాస్త ఆందోళన పరిచే అంశం.  

డికాక్‌ చేసిన గాయంతో...
ఉన్నపళంగా సిరీస్‌ మధ్యలోనే సీనియర్‌ వికెట్‌ కీపర్, బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ చేసిన రిటైర్మెంట్‌ గాయం జట్టు గత టెస్టు పరాజయానికంటే ఎక్కువగా ఉంది. అనుభవజ్ఞుల కొరతతో తల్లడిల్లుతున్న దక్షిణాఫ్రికా జట్టు పాలిట ఇది మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. తొలి టెస్టులో కెప్టెన్‌ ఎల్గర్‌ చక్కని పోరాటం చేశాడు. ఇతనికి మార్క్‌రమ్‌ తోడయితేనే శుభారంభమైనా... ఇంకేదైనా! లేదంటే ఆరంభంలోనే తడబడితే భారత సీమర్లు... తమకు కలిసొచ్చే బౌన్సీ వికెట్‌పై సఫారీ బ్యాటర్స్‌ను త్వరగానే కట్టేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దక్షిణాఫ్రికా జట్టు ఒకరిద్దరిపై ఆధారపడితే కుదరనే కుదరదు.

సిరీస్‌ పోరాటం ఆఖరి టెస్టుదాకా సాగాలంటే కచ్చితంగా ఎల్గర్‌ సేన సమష్టిగా పోరాడాల్సిందే. బ్యాటింగ్‌లో బవుమా, వాన్‌ డెర్‌ డసెన్‌ బాధ్యత పంచుకోవాలి. బౌలింగ్‌లో నోర్జే గైర్హాజరీ లోటే అయినా ఎన్‌గిడి, రబడ, ఒలివర్‌ చక్కని ప్రభావం చూపుతున్నారు. తమకు కంచుకోటలాంటి ‘సెంచూరియన్‌’లో ఎదురైన చేదు ఫలితానికి గట్టి బదులు తీర్చుకోవాలంటే తప్పకుండా సీమర్లంతా సర్వశక్తులు ఒడ్డాలి. భారత పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌కు తూట్లు పొడిస్తేనే సఫారీ ఆటలు వాండరర్స్‌లో సాగుతాయి. లేదంటే సెంచూరియన్‌ కథే పునరావృతమైన ఆశ్చర్యం లేదు.

పిచ్, వాతావరణం
వాండరర్స్‌ అంటేనే పేస్, బౌన్సీ వికెట్‌. గత మ్యాచ్‌లాగే ఇక్కడా సీమర్లు మ్యాచ్‌ విన్నర్లు కావొచ్చు. ఈ నేపథ్యంలో బ్యాటర్స్‌కు సవాళ్లు తప్పవు. అయితే వర్షం ముప్పు మ్యాచ్‌పై ఆందోళన పెంచుతోంది.

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, మయాంక్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, శార్దుల్, షమీ, బుమ్రా, సిరాజ్‌.
దక్షిణాఫ్రికా: ఎల్గర్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, పీటర్సన్, డసెన్, బవుమా, కైల్‌ వెరినె, ముల్డర్‌/జాన్సెన్, రబడ, కేశవ్‌ మహరాజ్, ఒలీవర్, ఎన్‌గిడి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top