జురెల్‌, పడిక్కల్‌ అద్భుత శతకాలు.. డ్రాగా ముగిసిన భారత్‌-ఆసీస్‌ తొలి టెస్ట్‌ | IND A VS AUS A 1st Unofficial Test Ended Drawn | Sakshi
Sakshi News home page

జురెల్‌, పడిక్కల్‌ అద్భుత శతకాలు.. డ్రాగా ముగిసిన భారత్‌-ఆసీస్‌ తొలి టెస్ట్‌

Sep 19 2025 5:08 PM | Updated on Sep 19 2025 5:20 PM

IND A VS AUS A 1st Unofficial Test Ended Drawn

భారత్‌ ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నాలుగో రోజైన ఇవాళ (సెప్టెంబర్‌ 19) నిర్దేశిత సమయం​ కంటే ముందుగానే మ్యాచ్‌ను ముగించారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. 6 వికెట్ల నష్టానికి 532 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌ (109), వికెట్‌ కీపర్‌ జోష్‌ ఫిలిప్‌ (123 నాటౌట్‌) సెంచరీలతో కదంతొక్కగా.. క్యాంప్‌బెల్‌ కెల్లావే (88), కూపర్‌ కన్నోల్లీ (70), లియమ్‌ స్కాట్‌ (81) సెంచరీలకు చేరువై ఔటయ్యారు. భారత బౌలర్లలో హర్ష్‌ దూబే 3, గుర్నూర్‌ బ్రార్‌ 2, ఖలీల్‌ అహ్మద్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం బరిలోకి దిగిన భారత్‌ ఆసీస్‌కు ధీటుగా జవాబిచ్చింది. ఆధిక్యం సాధించే అవకాశం ఉన్నా.. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఒక్క పరుగు ముందుగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 531 పరుగులు చేసింది.

ధృవ్‌ జురెల్‌ (197 బంతుల్లో 140; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్‌ (281 బంతుల్లో 150; 14 ఫోర్లు, సిక్స్‌) అద్బుత శతకాలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్‌ (73), ఎన్‌ జగదీసన్‌ (64) అర్ద సెంచరీలతో రాణించారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (8) ఒక్కడే విఫలమయ్యాడు.

ఒక్క పరుగు లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌.. 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. సామ్‌ కొన్‌స్టాస్‌ 27, క్యాంప్‌బెల్‌ కెల్లావే 24 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఈ దశలో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ ఇదే వేదికగా సెప్టెంబర్‌ 23-26 మధ్య జరుగనుంది.

కాగా, ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధి​కారిక టెస్ట్‌ మ్యాచ్‌లు.. 3 అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. వన్డేలు సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 3, 5 తేదీల్లో కాన్పూర్‌ వేదికగా జరుగనున్నాయి.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement