IND VS SL 1st Test: కపిల్ రికార్డుపై కన్నేసిన అశ్విన్.. మరో ఐదు వికెట్ల దూరంలో..!

IND VS SL 1st Test: Ashwin On Cusp Of Breaking Kapil Dev 434 Wicket Record - Sakshi

మొహాలీ వేదికగా ఈనెల 4 నుంచి శ్రీలంకతో ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా వెటరన్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ మరో ఐదు వికెట్లు తీస్తే.. లెజెండరీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ రికార్డును బద్దలు కొడతాడు. కపిల్‌ 131 టెస్ట్‌ల్లో 434 వికెట్లతో అత్యధిక టెస్ట్‌ వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉండగా.. అశ్విన్‌ కేవలం 84 మ్యాచ్‌ల్లోనే 430 వికెట్లు పడగొట్టి కపిల్‌ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో దిగ్గజ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే 132 టెస్ట్‌ల్లో 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

అశ్విన్‌.. కపిల్‌ రికార్డును బద్దలు కొట్టే క్రమంలో మరో ఇద్దరు దిగ్గజ బౌలర్ల రికార్డులను కూడా అధిగమించనున్నాడు. మరో రెండు వికెట్లు తీస్తే న్యూజిలాండ్ మాజీ పేసర్‌ రిచర్డ్ హ్యాడ్లీ (86 టెస్టులలో 431 వికెట్లు)ని, మూడు వికెట్లు తీస్తే శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ (93 టెస్టులలో 433 వికెట్లు)లను అధిగమిస్తాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు), ఆసీస్‌ గ్రేట్‌ స్పిన్నర్‌ షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు), జేమ్స్ అండర్సన్ (169 టెస్ట్‌ల్లో 640 వికెట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండగా, ప్రస్తుతానికి ఈ జాబితాలో అశ్విన్ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. 

కాగా, లంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్ జరగనున్న నేపథ్యంలో అశ్విన్‌ మరో 10 వికెట్లు తీయడం ఖాయంగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో అశ్విన్‌ 10 వికెట్ల మార్కును దాటగలిగితే సౌతాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ (93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు)ను వెనక్కునెట్టి టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకుతాడు. స్వదేశంలో టెస్ట్‌ల్లో ఘనమైన రికార్డు కలిగిన అశ్విన్‌కు ఈ రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

ఇదిలా ఉంటే, ఈ రికార్డులతో పాటు అశ్విన్‌ మరో రెండు రికార్డులపై కూడా కన్నేశాడు. లంకపై భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ​ జాబితాలో అనిల్ కుంబ్లే (18 మ్యాచ్‌ల్లో 73 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో  హర్భజన్  (16 మ్యాచ్‌ల్లో 53 వికెట్లు), అశ్విన్ (9 టెస్ట్‌ల్లో 50 వికెట్) ఉన్నారు. లంకతో సిరీస్‌లో యాష్‌ మరో నాలుగు వికెట్లు తీస్తే భజ్జీని అధిగమిస్తాడు. ఈ సిరీస్‌లో బౌలింగ్‌ రికార్డులతో పాటు ఓ బ్యాటింగ్ రికార్డుపై కూడా యాష్‌ గురిపెట్టాడు. లంకపై మరో 166 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 3000 పరుగుల మైలరాయిని చేరుకుంటాడు. ప్రస్తుతం అశ్విన్.. 120 ఇన్నింగ్స్‌ల్లో 2844 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 
చదవండి: రోహిత్‌ శర్మకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన కోహ్లి చిన్ననాటి కోచ్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top