IND VS NED: బుమ్రా ప్రపంచ రికార్డు సమం చేసిన భువీ.. మరో అరుదైన రికార్డు కూడా..!

IND VS NED: Bhuvneshwar Kumar Equals Bumrah Maiden Overs Record In T20Is - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌల్‌ చేసిన భువీ.. రెండు మెయిడిన్లు వేసి తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. భువీ వేసిన సెన్సేషనల్‌ స్పెల్‌లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. 

ఈ క్రమంలో భువీ.. బుమ్రా పేరిట ఉన్న అత్యధిక టీ20 మొయిడిన్ ఓవర్ల ప్రపంచ రికార్డును సమం చేయడంతో పాటు అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు మొయిడిన్లు సంధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మొయిడిన్‌ ఓవర్లు వేసిన రికార్డు బుమ్రా పేరిట ఉండేది. బుమ్రా 56 టీ20ల్లో 9 మొయిడిన్లు సంధించగా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భువీ (81 మ్యాచ్‌ల్లో 9 మెయిడిన్లు) బుమ్రా రికార్డును సమం చేశాడు.

ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రోహిత్‌ శర్మ (39 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 62 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (25 బంతుల్లో 51 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 

ఛేదనలో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నెదర్లాండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఈ విజయంతో భారత్‌.. మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి గ్రూప్‌-2 టాపర్‌గా నిలిచింది. కాగా, టోర్నీ తొలి మ్యాచ్‌లో రోహిత్‌ సేన్‌.. పాక్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఆ మ్యాచ్‌లో కోహ్లి వీరోచితంగా పోరాడి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించాడు.  

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top