Ind vs Ban: రోహిత్‌ శర్మ ఇంకో 18 పరుగులు చేస్తే.. | Ind vs Ban: Rohit On Cusp Of Overtaking Head Coach Gambhir In Elite List | Sakshi
Sakshi News home page

Ind vs Ban Tests: రోహిత్‌ శర్మ ఇంకో 18 పరుగులు చేస్తే..

Aug 17 2024 9:30 PM | Updated on Aug 17 2024 9:30 PM

Ind vs Ban: Rohit On Cusp Of Overtaking Head Coach Gambhir In Elite List

శ్రీలంక పర్యటన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. మళ్లీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా అతడు బిజీ కానున్నాడు. అంతకంటే ముందు టీమిండియా స్టార్లు దులిప్‌ ట్రోఫీ రూపంలో రెడ్‌బాల్‌ టోర్నీ ఆడనున్నా.. కెప్టెన్‌ సాబ్‌ మాత్రం సెలవులోనే ఉండనున్నాడు.

కాగా సెప్టెంబరు 19 నుంచి మొదలుకానున్న బంగ్లాతో సిరీస్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ ఇంకో 18 పరుగులు చేస్తే చాలు.. ప్రస్తుత హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ను అధిగమిస్తాడు. మాజీ ఓపెనర్‌ గౌతీ.. టీమిండియా తరఫున 58 టెస్టులు ఆడి 4154 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి.

గంభీర్‌ను దాటేయనున్న రోహిత్‌
ఇక రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు 59 టెస్టులు పూర్తి చేసుకుని 4138 రన్స్‌ సాధించాడు. ఇందులో 12 శతకాలు ఉన్నాయి. అయితే, బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ 18 పరుగులు సాధిస్తే.. టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక రన్స్‌ స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో గౌతీని వెనక్కినెట్టేస్తాడు.

కాగా భారత్‌ తరఫున టెస్టుల్లో సచిన్‌ టెండుల్కర్‌(ఓవరాల్‌గానూ)  15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్‌ ద్రవిడ్‌ 13265, సునిల్‌ గావస్కర్‌ 10122, విరాట్‌ కోహ్లి 8848 టాప్‌-5లో కొనసాగుతున్నారు. 37 ఏళ్ల రోహిత్‌ టెస్టుల్లో ఐదు వేల పరుగుల మార్కు దాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

వరుస టెస్టులు
ఇక చెన్నై వేదికగా సెప్టెంబరు 19- 23, కాన్పూర్‌ వేదికగా సెప్టెంబరు 27- అక్టోబరు 1 వరకు టీమిండియా- బంగ్లాదేశ్‌ మధ్య రెండు టెస్టులు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ తర్వాత భారత్‌ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. కాబట్టి గంభీర్‌ రికార్డు బ్రేక్‌ చేయడానికి రోహిత్‌కు ఎంతో కాలం పట్టదు.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 టైటిల్‌ గెలిచిన రోహిత్‌.. అంతర్జాతీయ టీ20లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీ తర్వాత లంక పర్యటనలో వన్డే సిరీస్‌ను 0-2తో కోల్పోయి కెప్టెన్‌గా చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement