Ind Vs Aus 3rd ODI: అతడికి విశ్రాంతి? సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌కు ఛాన్స్‌!

Ind Vs Aus 3rd ODI Chennai: Probable Playing XI Pitch Weather Condition - Sakshi

India vs Australia, 3rd ODI:  వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు టీమిండియా- ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం(మార్చి 22) ఆఖరి వన్డే జరుగనుంది. సిరీస్‌ విజేతను తేల్చే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఇప్పటికే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ కోల్పోయిన ఆసీస్‌ వన్డేల్లోనైనా పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 

చెపాక్‌ మైదానంలో..
కాగా భారత్‌- ఆసీస్‌ ఆఖరి మ్యాచ్‌ జరిగే చెపాక్‌ మైదానం చాలా కాలంగా స్పిన్‌కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు ఎక్కువగా నమోదు కాలేదు. ఈసారీ అలాగే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వరుసగా రెండు వన్డేల్లో విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌కు తుదిజట్టులో చోటు ఖాయమని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. దీంతో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

అయితే, వైజాగ్‌ వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌-2023 నేపథ్యంలో మహ్మద్‌ షమీపై పనిభారం తగ్గించాలని భావిస్తే ఉమ్రాన్‌ మాలిక్‌ ఆఖరి వన్డేలో ఆడే ఛాన్స్‌ ఉంది.

ఇక.. ఆసీస్‌ విషయానికొస్తే స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తిరిగి జట్టులోకి రానుండగా.. రెండు వన్డేల్లో దుమ్ములేపిన మార్ష్‌ మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉంది. కాగా బుధవారం నాటి  మ్యాచ్‌కు వర్షసూచన లేదు. 

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌, కేఎల్‌ రాహుల్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్, మహ్మద్‌ షమీ/ఉమ్రాన్‌ మాలిక్‌, మహ్మద్‌ సిరాజ్‌.

ఆస్ట్రేలియా: స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్, ట్రావిస్‌ హెడ్, మిచెల్‌ మార్ష్ , అలెక్స్‌ క్యారీ, కామెరాన్‌ గ్రీన్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, మార్కస్‌ స్టొయినిస్, అష్టన్‌ అగర్, మిచెల్‌ స్టార్క్,  ఆడం జంపా.  

చదవండి: NED Vs ZIM: శతకంతో అదరగొట్టిన తెలుగు క్రికెటర్‌; జింబాబ్వేపై నెదర్లాండ్స్‌ విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top