నితీశ్‌ రెడ్డి, ఇషాన్‌కు లక్కీ ఛాన్స్‌.. పాపం పంత్‌! | IND vs AFG: Pant Dropped Fresh Faces In Squads Schedule Timings | Sakshi
Sakshi News home page

నితీశ్‌ రెడ్డి, ఇషాన్‌లకు లక్కీ ఛాన్స్‌.. పాపం పంత్‌!.. కొత్త ముఖాలు ఇవే

May 19 2026 5:19 PM | Updated on May 19 2026 6:01 PM

IND vs AFG: Pant Dropped Fresh Faces In Squads Schedule Timings

అఫ్గనిస్తాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో సొంతగడ్డపై అఫ్గన్‌తో తలపడే జట్ల వివరాలను మంగళవారం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా గమనించదగ్గ అంశాలు ఏమిటంటే..

పాపం పంత్‌!
ఐపీఎల్‌-2026లో వరుస వైఫల్యాలతో సతమతమైన లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు సెలక్టర్లు షాకిచ్చారు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించారు. పంత్‌ స్థానంలో సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను గిల్‌ డిప్యూటీగా నియమించారు.

అంతేకాదు వన్డే జట్టులోనూ పంత్‌కు చోటు దక్కలేదు. కేఎల్‌ రాహుల్‌తో కలిసి వికెట్‌ కీపర్‌ కోటాలో ఇషాన్‌ కిషన్‌ చోటు దక్కించుకున్నాడు.  కాగా 2023 అక్టోబరులో చివరగా టీమిండియా తరఫున వన్డే ఆడిన ఇషాన్‌ కిషన్‌.. ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు. 

అతడికి ఇదొక గోల్డెన్‌ ఛాన్స్‌
ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ జార్ఖండ్‌ పాకెట్‌ డైనమైట్‌.. ఏకంగా టీ20 ప్రపంచకప్‌-2026లో ఆడిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌.. ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ తరఫునా సత్తా చాటుతున్నాడు. 

వారిద్దరికి విశ్రాంతి
ఈ క్రమంలోనే వన్డే జట్టులోనూ అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. నిజంగా అతడికి ఇదొక గోల్డెన్‌ ఛాన్స్‌ లాంటిదే. ఇక ముందుగా ఊహించినట్లుగానే ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడిపై పనిభారాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కూడా ఈ సిరీస్‌లకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అతడికి కూడా విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. రంజీల్లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆకిబ్‌ నబీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు.

కొత్త ముఖాలకు చోటు
తాజా ఎడిషన్‌లో ఆకిబ్‌ 60 వికెట్లు తీసినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఐపీఎల్‌, దేశీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న యువ పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్‌కు మాత్రం తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రిన్స్‌ను ఎంపిక చేసింది.

రోహిత్‌, హార్దిక్‌ డౌటే
ఇక ప్రిన్స్‌ యాదవ్‌తో పాటు పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌, స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌, స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హర్ష్‌ దూబే వంటి కొత్త ఆటగాళ్లు కూడా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, దిగ్గజ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌కు లోబడి అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.

ఇప్పటికే టెస్టు జట్టులో పాతుకుపోయిన ఆంధ్ర పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి.. హార్దిక్‌ ఫిట్‌నెస్‌ సమస్యల దృష్ట్యా వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇక వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ తన స్థానం నిలబెట్టుకోగా.. అఫ్గన్‌తో సిరీస్‌ ద్వారా దిగ్గజ బ్యాటర్‌, వన్డే రారాజు విరాట్‌ కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్ట‌న్‌ సుందర్, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, కుల్దీప్‌ యాదవ్, నితీశ్‌ కుమార్ రెడ్డి, ధ్రువ్‌ జురెల్, ప్రసిధ్‌ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌, హ‌ర్ష్ దూబే.

అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయ‌స్‌ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్ట‌న్ సుందర్, కుల్దీప్‌ యాదవ్, ప్రసిధ్‌ కృష్ణ, ప్రిన్స్‌ యాదవ్, గుర్నూర్‌ బ్రార్‌, హ‌ర్ష్‌ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.

టీమిండియా- అఫ్గనిస్తాన్‌ టెస్టు, వన్డే సిరీస్‌ షెడ్యూల్‌
ఏకైక టెస్టు: జూన్‌ 6 నుంచి మొదలు- న్యూ చండీగఢ్‌- ఉదయం 9.30 గంటలకు ఆరంభం
తొలి వన్డే: జూన్‌ 14-  ధర్మశాల- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం
రెండో వన్డే: జూన్‌ 17- లక్నో- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం
మూడో వన్డే: జూన్‌ 20- చెన్నై- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం.

చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్‌ కీలక ప్లేయర్లు అవుట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement