బోణీ కొట్టిన బంగ్లాదేశ్‌.. కెప్టెన్‌ విధ్వంసకర శతకం | ICC Women's World Cup Qualifier 2025: Bangladesh Beat Thailand By 178 Runs | Sakshi
Sakshi News home page

బోణీ కొట్టిన బంగ్లాదేశ్‌.. కెప్టెన్‌ విధ్వంసకర శతకం

Apr 10 2025 4:28 PM | Updated on Apr 10 2025 4:56 PM

ICC Women's World Cup Qualifier 2025: Bangladesh Beat Thailand By 178 Runs

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2025లో ఇవాళ (ఏప్రిల్‌ 10) బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌ తలపడ్డాయి. లాహోర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ థాయ్‌ను 178 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (80 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. షర్మిన్‌ అక్తర్‌ (126 బంతుల్లో 94 నాటౌట్‌; 11 ఫోర్లు) సెంచరీకి చేరువై అజేయంగా నిలిచింది. ఓపెనర్‌ ఫర్జానా హాక్‌ (53) అర్ద సెంచరీతో రాణించింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పసికూన థాయ్‌లాండ్‌.. బంగ్లా స్పిన్నర్లు ఫహిమ ఖాతూన్‌ (8.5-1-21-5), జన్నతుల్‌ ఫిర్దౌస్‌ (5-3-7-5) చెలరేగడంతో 23.5 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. థాయ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. చనిద (22) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బోణీ కొట్టింది.

కాగా, ఈసారి మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ పోటీలకు పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ సహా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, థాయ్‌లాండ్‌ వరల్డ్‌కప్‌ బెర్త్‌ కోసం పోటీపడుతున్నాయి.

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement