T20 World Cup: భారత్‌లో నిర్వహిస్తారా.. లేదా!

ICC Given Some Time To Conduct T20 Worldcup Matches In India - Sakshi

2027లో 14 జట్లతో వన్డే వరల్డ్‌ కప్‌

దుబాయ్‌: ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగలరా లేదా అనే విషయంపై జూన్‌ 28లోగా తమకు స్పష్టతనివ్వాలని బీసీసీఐని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కోరింది. మంగళవారం జరిగిన వర్చువల్‌ సమావేశంలో భారత బోర్డు విజ్ఞప్తి మేరకు ఐసీసీ మరో నెల రోజులు గడువిచ్చింది. దీనిపై బీసీసీఐ నుంచి స్పందన వచ్చిన తర్వాత జూన్‌ 28న తర్వాత జరిగే తమ సమావేశంలో ఐసీసీ అధికారికంగా వరల్డ్‌కప్‌ వివరాలను ప్రకటిస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో భారత్‌లో టోర్నీ జరగాల్సి ఉంది.

అయితే దేశంలోని తాజా పరిస్థితులు, అక్టోబర్‌ సమయంలో కరోనా మూడో వేవ్‌ రావచ్చనే అంచనాల నేపథ్యంలో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. వేదికలు, 16 జట్లకు సాధారణ ఏర్పాట్లతో పాటు బయో బబుల్‌ కట్టుబాట్లు, అభిమానులను అనుమతించే విషయాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 900 కోట్ల రాయితీ పొందడం తదితర అంశాలపై పూర్తి వివరాలతో ఐసీసీకి బీసీసీఐ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. భారత్‌లో సాధ్యం కాదని తేలితే వరల్డ్‌కప్‌ ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈ, ఒమన్‌లను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే వేదిక ఏదైనా నిర్వహణ ఏర్పాట్లు మాత్రమే బీసీసీఐనే చూస్తుంది.  

2024 టి20 ప్రపంచకప్‌లో 20 జట్లు... 
ఐసీసీ సమావేశంలో 2023–2031 భవిష్యత్‌ పర్యటన కార్యక్రమానికి (ఎఫ్‌టీపీ) సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌లో 14 జట్లు, 2024లో జరిగే టి20 ప్రపంచకప్‌లో 20 జట్లు ఉంటాయని ఐసీసీ ప్రకటించింది. 2025లో మళ్లీ చాంపియన్స్‌ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో నాలుగు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరుగుతాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top