చాంపియన్‌ హైదరాబాద్‌ | Hyderabad team wins Buchi Babu Trophy title for second consecutive year | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ హైదరాబాద్‌

Sep 10 2025 4:22 AM | Updated on Sep 10 2025 4:22 AM

Hyderabad team wins Buchi Babu Trophy title for second consecutive year

వరుసగా రెండో ఏడాది బుచ్చిబాబు ట్రోఫీ టైటిల్‌ సొంతం

టీఎన్‌సీఏతో ‘డ్రా’గా ముగిసిన ఫైనల్‌

తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో దక్కిన ట్రోఫీ

చెన్నై: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్‌ జట్టు... వరుసగా రెండో ఏడాది ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచింది. తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుతో జరిగిన ఫైనల్‌ ‘డ్రా’గా ముగియగా... తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ హైదరాబాద్‌కు టైటిల్‌ ఖాయమైంది. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా... టీఎన్‌సీఏ జట్టు 353 పరుగులకు పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌ జట్టుకు 23 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. 

ఓవర్‌నైట్‌ స్కోరు 14/1తో మంగళవారం అఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ జట్టు... చివరకు 70 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వరుణ్‌ గౌడ్‌ (122 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... రాహుల్‌ రాధేశ్‌ (133 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు), రవితేజ (87 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. వరుణ్‌ గౌడ్, రాహుల్‌ రాధేశ్‌ అబేధ్యమైన ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. 

ప్రత్యర్థి బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట అలవోకగా పరుగులు రాబట్టింది. భారీ షాట్‌లకు పోకుండా సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్‌ రొటేట్‌ చేసింది. అమన్‌ రావు (19), హిమతేజ (11), కెపె్టన్‌ రాహుల్‌ సింగ్‌ (2) ఎక్కువసేపు నిలవలేకపోయారు. టీఎన్‌సీఏ బౌలర్లలో విద్యుత్, హేమచుడేశన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని హైదరాబాద్‌ జట్టు ఓవరాల్‌గా 178 పరుగుల ముందంజలో నిలిచింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెపె్టన్‌లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రా’కు అంగీకరించారు. 

ఆట చివరి రోజు హైదరాబాద్‌ ప్లేయర్లు సాధికారికంగా ఆడారు. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా... వరుసగా రెండో ఏడాది ట్రోఫీ చేజిక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ హాఫ్‌సెంచరీ బాదిన హైదరాబాద్‌ ప్లేయర్‌ హిమతేజకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, టోర్నీ ఆసాంతం రాణించిన ఆల్‌రౌండర్‌ వరుణ్‌ గౌడ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డులు దక్కాయి. విజేత హైదరాబాద్‌ జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 3 లక్షల నగదు బహుమతి దక్కింది. విజేతలకు భారత మాజీ ఆటగాడు రాబిన్‌ సింగ్, తమిళనాడు క్రికెట్‌ సంఘం ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement