‘ఉత్తమ ప్లేయర్లు’ హార్దిక్, నవ్‌నీత్‌ | Hockey India Annual Awards Ceremony held in New Delhi | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ ప్లేయర్లు’ హార్దిక్, నవ్‌నీత్‌

Mar 28 2026 1:30 AM | Updated on Mar 28 2026 1:30 AM

Hockey India Annual Awards Ceremony held in New Delhi

హాకీ ఇండియా వార్షిక పురస్కారాలు ప్రదానం

జాఫర్‌ ఇక్బాల్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

‘గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ బిచ్చూదేవి 

‘డిఫెండర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ సంజయ్‌ 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కనబరుస్తున్న భారత హాకీ ప్లేయర్లు హార్దిక్‌ సింగ్, నవ్‌నీత్‌ కౌర్‌లకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులు దక్కాయి. గతేడాది ప్రదర్శనకు గాను హాకీ ఇండియా శుక్రవారం ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. భారత మాజీ కెప్టెన్‌ 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన జట్టులో సభ్యుడైన జాఫర్‌ ఇక్బాల్‌కు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 1978, 1982 ఆసియా క్రీడల్లో రజత పతకాలు గెలిచిన జట్టులోనూ ఇక్బాల్‌ సభ్యుడు. 

1982 చాంపియన్స్‌ ట్రోఫీలో కాంస్యం గెలిచిన జట్టులోనూ ఇక్బాల్‌ ఉన్నాడు. హాకీకి చేసిన సేవకుగానూ జాఫర్‌ ఇక్బాల్‌కు జీవన సాఫల్య పురస్కారంతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందించారు. హార్దిక్, నవ్‌నీత్‌లకు అవార్డులతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి దక్కింది. మహిళల జట్టు ప్లేయర్‌ బిచ్చూ దేవికి ‘గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు లభించగా... ఉత్తమ డిఫెండర్‌గా సంజయ్‌కు పురస్కారం దక్కింది. ‘మిడ్‌ఫీల్డర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు సుమిత్‌కు దక్కగా... ‘ఫార్వర్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు సుఖ్‌జీత్‌ సింగ్‌కు దక్కింది. 

వీరందరికీ అవార్డుతో పాటు రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. శుక్రవారం న్యుఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్‌–21 ఏజ్‌ గ్రూప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సాక్షి రాణా, ప్రిన్స్‌ దీప్‌ సింగ్‌కు ‘అప్‌కమింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులు అందించారు. ఈ ఇద్దరికీ చెరో రూ. 10 లక్షల నగదు బహుమతి అందించారు. ప్లేయర్లతో పాటు అంపైర్లు, స్కోరర్లకు కూడా పురస్కారాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆసియాకప్‌లో విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ప్లేయర్లను ప్రత్యేకంగా సన్మానించారు. ట్రోఫీ నెగ్గిన జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి తలా రూ. 1.5 లక్షలు అందజేశారు. జూనియర్‌ వరల్డ్‌కప్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.15 లక్షల చొప్పున అందజేశారు.  

» హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఎఫ్‌ఐహెచ్‌ మహిళల వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో సత్తా చాటిన నవ్‌నీత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు లభించింది.  
»   గతేడాది జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన ఏడు (జార్ఖండ్, హరియాణా, మిజోరం, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌) జట్లకు రూ. 10 లక్షల చొప్పున అందజేశారు.   
»   అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లకు ఇన్సెంటివ్‌లను సైతం శుక్రవారం అందజేశారు. పురుషుల జట్టుకు రూ. 1.38 కోట్లు, మహిళల జట్టుకు రూ. 69 లక్షలు లభించాయి.  
» జాతీయ జట్టు తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మన్‌ప్రీత్‌ సింగ్‌కు రూ. 4 లక్షలు, 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్‌ సింగ్‌కు రూ. 2.5 లక్షలు అందించారు.  
» 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హార్దిక్‌ సింగ్, క్రిషన్‌ బహదూర్‌ పాఠక్, నిలకంఠ శర్మ, జర్మన్‌ప్రీత్‌ సింగ్, సలీమా టెటెకు రూ.1.50 లక్షలు... 100 మ్యాచ్‌లు ఆడిన అభిõÙక్, సుఖ్‌జీత్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్‌కు రూ. 1 లక్ష చొప్పున అందజేశారు.  
» మహిళల హాకీలో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నవ్‌నీత్‌ కౌర్, నిక్కీ ప్రధాన్‌కు రూ. 2 లక్షల చొప్పున ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement