hockey players
-
‘ఉత్తమ ప్లేయర్లు’ హార్దిక్, నవ్‌నీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కనబరుస్తున్న భారత హాకీ ప్లేయర్లు హార్దిక్ సింగ్, నవ్‌నీత్ కౌర్‌లకు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు దక్కాయి. గతేడాది ప్రదర్శనకు గాను హాకీ ఇండియా శుక్రవారం ప్లేయర్లకు పురస్కారాలు అందజేసింది. భారత మాజీ కెప్టెన్ 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పసిడి పతకం నెగ్గిన జట్టులో సభ్యుడైన జాఫర్ ఇక్బాల్‌కు మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 1978, 1982 ఆసియా క్రీడల్లో రజత పతకాలు గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ సభ్యుడు. 1982 చాంపియన్స్ ట్రోఫీలో కాంస్యం గెలిచిన జట్టులోనూ ఇక్బాల్ ఉన్నాడు. హాకీకి చేసిన సేవకుగానూ జాఫర్ ఇక్బాల్‌కు జీవన సాఫల్య పురస్కారంతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందించారు. హార్దిక్, నవ్‌నీత్‌లకు అవార్డులతో పాటు రూ. 20 లక్షల నగదు బహుమతి దక్కింది. మహిళల జట్టు ప్లేయర్ బిచ్చూ దేవికి ‘గోల్‌కీపర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించగా... ఉత్తమ డిఫెండర్‌గా సంజయ్‌కు పురస్కారం దక్కింది. ‘మిడ్‌ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుమిత్‌కు దక్కగా... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు సుఖ్జీత్ సింగ్‌కు దక్కింది. వీరందరికీ అవార్డుతో పాటు రూ. 5 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. శుక్రవారం న్యుఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్–21 ఏజ్ గ్రూప్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సాక్షి రాణా, ప్రిన్స్ దీప్ సింగ్‌కు ‘అప్‌కమింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు అందించారు. ఈ ఇద్దరికీ చెరో రూ. 10 లక్షల నగదు బహుమతి అందించారు. ప్లేయర్లతో పాటు అంపైర్లు, స్కోరర్లకు కూడా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆసియాకప్‌లో విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ప్లేయర్లను ప్రత్యేకంగా సన్మానించారు. ట్రోఫీ నెగ్గిన జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 3 లక్షలు, సహాయక సిబ్బందికి తలా రూ. 1.5 లక్షలు అందజేశారు. జూనియర్ వరల్డ్‌కప్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 1.15 లక్షల చొప్పున అందజేశారు. » హైదరాబాద్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ టోర్నీలో సత్తా చాటిన నవ్‌నీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది. » గతేడాది జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన ఏడు (జార్ఖండ్, హరియాణా, మిజోరం, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్) జట్లకు రూ. 10 లక్షల చొప్పున అందజేశారు. » అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లకు ఇన్సెంటివ్‌లను సైతం శుక్రవారం అందజేశారు. పురుషుల జట్టుకు రూ. 1.38 కోట్లు, మహిళల జట్టుకు రూ. 69 లక్షలు లభించాయి. » జాతీయ జట్టు తరఫున 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మన్‌ప్రీత్ సింగ్‌కు రూ. 4 లక్షలు, 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్‌కు రూ. 2.5 లక్షలు అందించారు. » 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హార్దిక్ సింగ్, క్రిషన్ బహదూర్ పాఠక్, నిలకంఠ శర్మ, జర్మన్‌ప్రీత్ సింగ్, సలీమా టెటెకు రూ.1.50 లక్షలు... 100 మ్యాచ్‌లు ఆడిన అభిõÙక్, సుఖ్జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్‌కు రూ. 1 లక్ష చొప్పున అందజేశారు. » మహిళల హాకీలో 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నవ్‌నీత్ కౌర్, నిక్కీ ప్రధాన్‌కు రూ. 2 లక్షల చొప్పున ఇచ్చారు. -
నెలకు రూ. 25 వేలు
న్యూఢిల్లీ: భారత హాకీ ప్లేయర్లకు నెలవారీ భత్యం ఇచ్చేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. ఇప్పటి వరకు కేవలం ప్రదర్శన ఆధారంగా మాత్రమే ప్లేయర్లకు నజరానాలు అందుతుండగా... ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం తరఫున ప్రతి నెల ఒక్కో ప్లేయర్‌కు రూ. 25 వేలు భత్యంగా ఇవ్వాలని క్రీడా శాఖ నిర్ణయించింది. ఈ అంశంపై చాన్నాళ్లుగా చర్చలు జరుగుతుండగా... హాకీ ఇండియా ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. జాతీయ శిబిరాలకు ఎంపికయ్యే పురుష, మహిళా ప్లేయర్లకు ఈ భత్యం అందించనున్నట్లు వెల్లడించింది. ‘ఆటగాళ్లకు నెలవారీ ప్రోత్సహకంగా భత్యం రూపంలో అందించాలని హాకీ ఇండియా చాలా రోజులుగా కోరుతోంది. వారి డిమాండ్‌కు అంగీకారం తెలిపాం. ప్రతిభ గల ఆటగాళ్లకు అండగా నిలిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు వస్తాయి’ అని కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. → పురుషుల విభాగంలో 40 మంది ఆటగాళ్లు, మహిళల విభాగంలో 40 మంది ప్లేయర్లకు ఈ భత్యాలు అందించనుంది. → టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో భాగంగా గురువారం నిర్వహించిన ‘మిషన్ ఒలింపిక్ కమిటీ’లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. → కోర్ గ్రూప్ ప్లేయర్లకు రూ. 50 వేల చొప్పున దక్కనున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి నెలకు రూ. 20 లక్షలు ఖర్చు కానున్నాయి. → హాకీ ఇండియా ప్రతి నెలా ప్లేయర్ల జాబితాను క్రీడాశాఖకు పంపనుంది. ఫిట్నెస్, ఫామ్ ఆధారంగా ప్లేయర్ల ఎంపిక జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. → ప్రస్తుతం హాకీ ఆటగాళ్లు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న విభాగాలు, సంస్థలు, బోర్డుల నుంచి జీతాలు పొందుతున్నారు. వీటికి అదనంగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన సమయంలో లభించే ప్రైజ్‌మనీని పంచుకుంటున్నారు. → భారత పురుషుల హాకీ జట్టు గత కొంతకాలంలో ఎంతో మెరుగైంది. 2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా కాంస్య పతకాలు సాధించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన మహిళల జట్టు... పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. → ప్రస్తుతం భారత పురుషుల, మహిళల హాకీ జట్లు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ యూరోప్ అంచె పోటీల్లో పాల్గొంటున్నాయి. అయితే కఠిన పరిస్థితుల్లో ఇరు జట్లు విజయాలు సాధించలేక ఇబ్బంది పడుతున్నాయి. → ‘టాప్స్’లో భాగంగా హాకీ ఆటగాళ్లకే కాకుండా ఇతర క్రీడలకు చెందిన ప్లేయర్లకు సైతం క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా నిధులు విడుదల చేసింది. → టెన్నిస్ ఆటగాళ్లు సాకేత్ మైనేని, జీవన్ నెడుంజెళియాన్‌తో పాటు మరో ముగ్గురు మహిళా ప్లేయర్లకు కలిపి రూ. 1.38 కోట్లు వేర్వేరు కారణాల కోసం విడుదల చేసింది. మొత్తంగా ఈ భేటీలో అథ్లెట్ల కోసం మొత్తం రూ. 4.28 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇందులో పలువురు పారా అథ్లెట్లు కూడా ఉన్నారు. → ప్రతిభకు పట్టం కట్టే విధానంలో సాంకేతికతను వినియోగించుకోవాలని కేంద్ర క్రీడా శాఖ నిర్ణయించింది. గ్రామీణ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించిన అథ్లెట్లను ఖేలో ఇండియా రీజనల్ సెంటర్లలో అవకాశం కలి్పంచి వారి మెరుగుదలను నమోదు చేయాలని నిర్ణయించింది. వయో విభాగాలను బట్టి ప్రతిభావంతులకు మరింత ప్రోత్సాహం అందించనుంది. -
ఆ ఐదుగురు ఆసుపత్రికే...
బెంగళూరు : కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న ఐదుగురు భారత హాకీ జట్టు ఆటగాళ్లను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రికి తరలించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి సాధారణం కంటే తక్కువకు పడిపోవడంతో మంగళవారం భారత పురుషుల హాకీ జట్టు కీలక ఆటగాడు మన్దీప్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఎస్ఎస్ స్పర్శ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో మన్దీప్ చికిత్స పొందుతుండగా... ఇదే ఆసుపత్రిలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, డిఫెండర్లు సురేందర్ కుమార్, జస్కరణ్ సింగ్, డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్, గోల్‌కీపర్ కృషన్ బహదూర్ పాఠక్‌లను చేర్చారు. ఈనెల 20 నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రంలో జాతీయ హాకీ శిక్షణ శిబిరం మొదలవుతుంది. మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అందరికీ నెగెటివ్‌గా వచ్చింది. -
నలుగురు హాకీ ఆటగాళ్లు దుర్మరణం
హోసంగాబాద్(మధ్యప్రదేశ్): రోడ్డు ప్రమాదంలో నలుగురు జాతీయ స్థాయి హాకీ ఆటగాళ్లు దుర్మరణం చెందారు. సోమవారం ఉదయం హోసంగాబాద్‌లోని రాసాల్పూర్ వద్ద చోటు చేసుకున్న కారు ప్రమాదంలో నలుగురు హాకీ ఆటగాళ్లు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు. జాతీయ రహదారి-69పై హాకీ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో అతివేగంగా వెళుతున్న కారు జాతీయ రహదారి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు హాకీ ఆటగాళ్లు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ధ్యాన్‌చంద్ ట్రోఫీలో భాగంగా సదరు హాకీ ఆటగాళ్లు కారులో ఇతార్సి నుంచి హోసంగాబాద్‌కు వెళుతున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది. Madhya Pradesh: Four national level hockey players dead, three injured, in a car accident in Hoshangabad pic.twitter.com/otLiRNQzoQ — ANI (@ANI) October 14, 2019 -
ఘోర ప్రమాదం : 15 మంది హాకీ ఆటగాళ్ల మృతి
హంబోల్డ్ : కెనడాలో జరిగిన రోడ్డుప్రమాదం హాకీ అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ ఘటన సస్కచెవాన్ ప్రావిన్సులో శనివారం జరిగింది. జూనియర్ ఐస్ హాకీ జట్టుతో వెళుతున్న బస్సు మార్గమధ్యంలో సెమీ ట్రైలర్ ట్రక్కును ఢీకొంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో టిస్డేల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 15 మంది చనిపోగా మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే మృతుల్లో 24 మంది ఆటగాళ్లు. వీరి వయసు 16 నుంచి 21లోపే. ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆవేదన వ్యక్తం చేశారు. -
హాకీ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువు
డీఈఓ మువ్వా రామలింగం వెంకటాచలం : దేశంలో హాకీ క్రీడకు, క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం అన్నారు. 62వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలు మండలంలోని సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయంలో శనివారం ప్రారంభమయ్యాయి. డీఈఓ మువ్వా మాట్లాడుతూ హాకీ క్రీడ ద్వారా భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. హాకీ క్రీడను ప్రోత్సహిస్తే వందల మంది క్రీడాకారులను తయారు చేయగల సత్తా వ్యాయామ ఉపాధ్యాయుల్లో ఉందన్నారు. విద్యార్థులు చదువుతోపాటుగా ఆటల్లో కూడా రాణించాలన్నారు. కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, ఎంఈవో కొండయ్య, జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలు వీరే 62వ స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు అక్షర విద్యాలయానికి వచ్చాయి. లీగ్ పద్ధతిలో తొలిరోజు మొత్తం 8 మ్యాచ్‌లు నిర్వహించారు. విజయం సాధించిన జట్లు బాలుర విభాగంలో.. శ్రీకాకుళం జట్టుపై తూర్పుగోదావరి 3–0తో గెలుపొందగా ప్రకాశం జట్టుపై గుంటూరు జట్టు 2–0తో విజయం సాధించింది. కర్నూల్‌పై క్రిష్ణా జిల్లా 3–0తో గెలుపొందగా పశ్చిమ గోదావరి, నెల్లూరు మధ్య జరిగిన పోటీ డ్రాగా మారింది. బాలికల విభాగంలో.. క్రిష్ణా జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్లు 3–0తో గెలుపొందగా, ప్రకాశం జిల్లా జట్లుపై నెల్లూరు జిల్లా జట్లు 3–0తో గెలుపొందింది. అలాగే శ్రీకాకుళంపై విశాఖపట్నం జట్టు విజయం సాధించింది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మిగతా లీగ్ మ్యాచ్‌లు పూర్తి చేసి సోమవారం క్వార్టర్స్, సెమీ, ఫైనల్స్ పోటీలు నిర్వహిస్తారు.


