
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వార్షిక సమావేశం నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. ఇక ఈ మీటింగ్‌లో పాల్గొనేందుకు 173 క్రికెట్ క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలకు మాత్రమే క్రికెట్ స్టేడియంలోకి అనుమతిస్తున్నారు.
అయితే, గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రటరీలకు అనుమతి లేదనిహెచ్‌సీఏ తేల్చి చెప్పింది. దీంతో అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రటరీలను మాత్రమే లిస్టు చూసి పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. కాగా ఈ సమావేశంలో అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు.. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టైన నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో హెచ్‌సీఏకు కొత్త అధ్యక్షుడి నియామకం జరుగనుండగా.. ఆశావహులు తమకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. అయితే, ఈ మీటింగ్‌ను అడ్డుకుంటామని తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించడంతో.. స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ సురేష్ కుమార్
తాజా సమాచారం ప్రకారం.. అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ సురేష్ కుమార్ ఎంపికయ్యారు. ఇక పోలీసుల బందోబస్తు నడుమ జరిగిన HCA వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ముగిసింది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని ఉప్పల్ స్టేడియానికి తీసుకువచ్చింది. అధ్యక్షుడు జగన్మోహన్ రావును శుక్రవారం స్టేడియానికి తీసుకువచ్చిన సీఐడీ.. తాజాగా ట్రెజరర్ శ్రీనివాస్, సీఈఓ సునీల్‌లను కూడా ఇక్కడికి తీసుకువచ్చి వివరాలు సేకరించింది.
కాగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడితో పాటు ట్రెజరర్ శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా సీఐడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్ విధించింది.
ఇక ఈ అక్రమాల కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించడం గమనార్హం. బీసీసీఐ నుంచి వచ్చే నిధులను మళ్లించారంటూ టీసీఏ ఆరోపించింది.