ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరినప్పటికి ముంబై ఇండియన్స్ ఆట తీరు మాత్రం మారడం లేదు. బుధవారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. మరోసారి ముంబై బ్యాటర్లు తీవ్ర నిరాశపరిచారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది.
ముంబై బ్యాటర్లలో కార్భిన్ బాష్ (32), హార్దిక్ పాండ్యా(26) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో చేధించింది. కేకేఆర్ విజయంలో మనీష్ పాండే(45), రావ్‌మన్ పావెల్(40) కీలక పాత్ర పోషించారు.
ముంబై బౌలర్లలో కార్భిన్ బాష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఘజన్‌ఫర్ తలా వికెట్ సాధించారు. ఈ ఏడాది సీజన్‌లో ముంబైకి తొమ్మిదవ పరాజయం కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని పాండ్యా అంగీకరించాడు.
"బ్యాటింగ్‌లో మేము 20 పరుగులు తక్కువ చేశాము. పవర్‌ప్లేలోనే మేం కీలక వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. ఒకవేళ నేను, తిలక్ వర్మ క్రీజులో మరికాసేపు నిలదొక్కుకుని ఉండి ఉంటే కనీసం 15 నుంచి 20 పరుగులు అదనంగా వచ్చేవి. అప్పుడు మాకు గెలిచేందుకు మంచి అవకాశం ఉండేది. అయినప్పటికి మా బౌలర్లు గేమ్‌ను ఆఖరివరకు తీసుకొచ్చారు.
స్కోర్ బోర్డులో పెద్దగా పరుగులు లేనప్పటికి మా బౌలర్లు పోరాడిన తీరు నిజంగా అద్భుతం. పిచ్ బ్యాటింగ్‌కు కాస్త కష్టంగా ఉంది. కానీ బౌలర్లకు కూడా సహకరించే ఇలాంటి పిచ్‌లపై ఆడటం నాకు ఇష్టమే. ప్రస్తుతం ఐపీఎల్ పూర్తిగా బ్యాటింగ్‌కే అనుకూలంగా మారుతోందని అన్పిస్తోంది. బౌలర్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు.
ఈ రోజు మాత్రం పిచ్ బౌలర్లకు కాస్త అనుకూలంగానే ఉంది. ఇక ఈ సీజన్ అంతటా మా ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. మేం చాలా క్యాచ్‌లు వదిలేశాం. ఎవరూ కావాలని క్యాచ్‌లు విడిచిపెట్టారు. కానీ మ్యాచ్‌లు గెలవాలంటే ఫీల్డింగ్ చాలా ముఖ్యం. క్యాచ్‌లే మ్యాచ్ ఫలితాలను నిర్ణయిస్తాయి.
మ్యాచ్ స్వరూపాన్నే మార్చే క్యాచ్‌లను జారవిడిస్తే , జట్టు ఎప్పడూ వెనుకబడే ఉంటుంది. మా చివరి మ్యాచ్ మాకు చాలా ప్రత్యేకమైనంది. 25,000 మంది చిన్నారుల ముందు ఆడనున్నాము. స్టేడియానికి వచ్చే ఆ పిల్లల ముఖాల్లో నవ్వులు పూయించడమే మా లక్ష్యం. గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు. ముంబై తమ చివరి మ్యాచ్‌లో మే 24 వాంఖడే స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.


