పరుగు తేడాతో గుజరాత్ అనూహ్య విజయం
గిల్, బట్లర్, సుందర్ అర్ధ సెంచరీలు
రాణించిన కేఎల్ రాహుల్
ఢిల్లీ విజయానికి చివరి 18 బంతుల్లో 45 పరుగులు కావాలి. రిటైర్డ్‌హర్ట్‌గాతప్పుకొని మళ్లీ క్రీజ్‌లోకి వచ్చిన మిల్లర్‌పైనే ఆశలు ఉన్నాయి. 18వ ఓవర్లో 9 పరుగులే వచ్చాయి. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్లో మిల్లర్ చెలరేగి 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో 11 పరుగులు లభించాయి. ఇక చేయాల్సింది 2 బంతుల్లో 2 పరుగులే!
అయితే డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వరకు బంతి వెళ్లినా సునాయాస సింగిల్ తీయకుండా కుల్దీప్‌ను మిల్లర్ వెనక్కి పంపించాడు. ఈ అనూహ్య నిర్ణయం ఢిల్లీని దెబ్బ తీసింది. ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ బంతిని మిల్లర్ ఆడలేకపోగా, సింగిల్ తీసే ప్రయత్నంలో కుల్దీప్ రనౌటయ్యాడు. వైడ్ కోసం అంపైర్లు పరిశీలించగా అది సరైందేనని తేలింది. దాంతో గుజరాత్ సంబరాలు చేసుకోగా... ఢిల్లీ బృందం నిరాశలో మునిగింది. అంతకుముందు గిల్, బట్లర్, సుందర్ అర్ధసెంచరీలతో గుజరాత్ భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి సవాల్ విసిరింది.
న్యూఢిల్లీ: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌లో గెలుపు బోణీ చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిన గుజరాత్ బుధవారం జరిగిన పోరులో ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), వాషింగ్టన్ సుందర్ (32 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (27 బంతుల్లో 52; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించడం విశేషం.
రెండో వికెట్‌కు బట్లర్‌తో 32 బంతుల్లో 60 పరుగులు జోడించిన గిల్... మూడో వికెట్‌కు సుందర్‌తో 61 బంతుల్లో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడిపోయింది. కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 92; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేజార్చుకోగా, డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడాడు.
భారీ భాగస్వామ్యం...
ఓపెనర్ సాయి సుదర్శన్ (12) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... చాలా కాలం తర్వాత బట్లర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడటంతో టైటాన్స్ భారీ స్కోరుకు పునాది పడింది. సిక్స్‌తో పరుగుల ఖాతా తెరిచిన బట్లర్...అక్షర్ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. అనంతరం ముకేశ్ వేసిన మూడో ఓవర్లో అతను చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అతను ఆ తర్వాత మరో సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి.
పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేయగా, 24 బంతుల్లోనే బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే కుల్దీప్ చక్కటి బంతితో అతని ఆటను ముగించాడు. ఈ దశలో గిల్, సుందర్ కలిసి ధాటిని ప్రదర్శించారు. విప్రాజ్ వేసిన 12వ ఓవర్ గుజరాత్‌కు కలిసొచ్చింది. ఈ ఓవర్లో సుందర్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, గిల్ మరో సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు లభించాయి.
33 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్న గిల్... కుల్దీప్ ఓవర్లో మరో రెండు సిక్స్‌లతో చెలరేగాడు. గుజరాత్ ఆఖరి 4 ఓవర్లలో 42 పరుగులు రాబట్టగా... 30 బంతుల్లో సుందర్ అర్ధసెంచరీ పూర్తయింది. అనారోగ్యంతో గత మ్యాచ్‌లో ఆడని గిల్ కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఒక్క కుల్దీప్ బౌలింగ్‌లోనే అతను నాలుగు సిక్సర్లు బాదడం విశేషం.
రిజ్వీ విఫలం...
సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాది నిసాంక జోరుగా ఛేదనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత అశోక్ ఓవర్లోనూ అతను వరుసగా 4, 6, 4, 4తో దూకుడు ప్రదర్శించాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన రాహుల్ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 63 పరుగులకు చేరింది. అశోక్ ఓవర్లోనే ఢిల్లీ 23 పరుగులు రాబట్టింది.
తొలి వికెట్‌కు 76 పరుగుల (49 బంతుల్లో) తర్వాత నిసాంకను ప్రసిధ్ అవుట్ చేయగా...అదే ఓవర్ చివరి నాలుగు బంతుల్లో రాహుల్ వరుసగా 4, 6, 6, 4తో చెలరేగి 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీశ్ రాణా (5) మళ్లీ విఫలం కాగా, గత రెండు మ్యాచ్‌ల హీరో సమీర్ రిజ్వీ (0) ఈసారి తొలి బంతికే బౌల్డయ్యాడు. అక్షర్ పటేల్ (2) కూడా నిలబడలేకపోగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో రాహుల్ అవుటయ్యాడు. 12 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా బయటకు వెళ్లిన మిల్లర్ ఈ దశలో తిరిగొచ్చి చివరి వరకు పోరాడినా లాభం లేకపోయింది.
స్కోరు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (బి) ముకేశ్ 12; గిల్ (సి) రాణా (బి) ఎన్‌గిడి 70; బట్లర్ (బి) కుల్దీప్ 52; సుందర్ (సి) రాణా (బి) ముకేశ్ 55; ఫిలిప్స్ (నాటౌట్) 14; తెవాటియా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–19, 2–79, 3–183, 4–205. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–55–2, ఎన్‌గిడి 4–0–24–1, అక్షర్ 3–0–32–0, కుల్దీప్ 4–0–42–1, నటరాజన్ 4–0–34–0, విప్రాజ్ 1–0–23–0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిసాంక (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 41; రాహుల్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 92; రాణా (సి) సుదర్శన్ (బి) రషీద్ 5; రిజ్వీ (బి) రషీద్ 0; మిల్లర్ (నాటౌట్) 41; అక్షర్ (సి) ఫిలిప్స్ (బి) రషీద్ 2; స్టబ్స్ (రనౌట్) 7; విప్రాజ్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 12; కుల్దీప్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–101, 3–101, 4–134, 5–160, 6–166, 7–202, 8–209. బౌలింగ్: సిరాజ్ 4–0–52–1, రబాడ 4–0–32–0, రషీద్ ఖాన్ 4–0–17–3, అశోక్ శర్మ 3–0–45–0, ప్రసిధ్ కృష్ణ 4–0–52–2, సుందర్ 1–0–11–0.
ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా X లక్నో
వేదిక: కోల్‌కతా
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


