నైట్‌రైడర్స్ ఐదో పరాజయం
5 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు
రాణించిన రబాడ, గిల్
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన రహానే సారథ్యంలోని నైట్‌రైడర్స్... మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది.
పాతిక కోట్ల విలువైన ప్లేయర్ కామెరాన్ గ్రీన్ (55 బంతుల్లో 79; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఎట్టకేలకు రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. రషీద్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్న గ్రీన్ భారీ షాట్‌లతో పరుగులు రాబట్టాడు. గుజరాత్ ఫీల్డింగ్ లోపాలు కూడా అతడికి కలిసి రావడంతో ఈ సీజన్‌లో తొలి అర్ధశతకం తన పేరిట లిఖించుకున్నాడు. పావెల్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ అజింక్యా రహానే (0), రఘువంశీ (8), సీఫెర్ట్ (19), అనుకూల్ రాయ్ (9), రింకూ సింగ్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు.
గుజరాత్ బౌలర్లలో రబాడ 3 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, అశోక్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 86; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో టైటాన్స్‌కిది మూడో విజయం.
శుబ్‌మన్ దూకుడు...
ఓపెనర్లు చెలరేగడంతో గుజరాత్‌కు శుభారంభం దక్కింది. తొలి ఓవర్‌లో ఓ ఫోర్ కొట్టిన శుబ్‌మన్, రెండో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్‌లో గిల్, సాయి సుదర్శన్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్) కలిసి 3 సిక్స్‌లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా గిల్ దూకుడు కొనసాగడంతో పవర్‌ప్లేలో గుజరాత్ 71 పరుగులు చేసి సుదర్శన్ వికెట్ కోల్పోయింది.
వచ్చీ రావడంతోనే 4, 6, 4 కొట్టిన బట్లర్ (15 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)... వరుణ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ క్రమంలో గిల్ 27 బంతుల్లో హాఫ్‌సెంచరీ సాధించాడు. బట్లర్, సుందర్ (13) వెనుదిరిగినా... ఛేదించాల్సిన లక్ష్యం పెద్దది కాకపోవడంతో గుజరాత్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. సెంచరీ చేసేలా కనిపించిన గిల్... గ్రీన్ పట్టిన చక్కటి క్యాచ్‌కు పెవిలియన్ బాటపట్టాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సైఫెర్ట్ (సి) ఫిలిప్స్ (బి) రబాడ 19; రహానే (సి) రబాడ (బి) సిరాజ్ 0; రఘువంశీ (సి) బట్లర్ (బి) రబాడ 8; గ్రీన్ (సి) బట్లర్ (బి) రషీద్ 79; పావెల్ (సి) సిరాజ్ (బి) అశోక్ 27; రాయ్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 9; రింకూ (సి) బట్లర్ (బి) రబాడ 1; రమణ్‌దీప్ (సి) సిరాజ్ (బి) అశోక్ 17; నరైన్ (సి) ఫిలిప్స్ (బి) సిరాజ్ 0; కార్తీక్ (రనౌట్) 6; వైభవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–32, 4–87, 5–147, 6–148, 7–165, 8–166, 9–173, 10–180. బౌలింగ్: సిరాజ్ 4–0–23–2; రబాడ 4–0–29–3; ప్రసిధ్ 4–0–32–1; అశోక్ 4–0–45–2; రషీద్ 4–0–44–1.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (సి) కార్తీక్ (బి) నరైన్ 22; గిల్ (సి) గ్రీన్ (బి) అరోరా 86; బట్లర్ (సి) గ్రీన్ (బి) వరుణ్ 25; సుందర్ (సి) కార్తీక్ (బి) వరుణ్ 13; ఫిలిప్స్ (సి) రింకూ (బి) రమణ్‌దీప్ 19; తెవాటియా (నాటౌట్) 7; షారుక్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 181. వికెట్ల పతనం: 1–57, 2–95, 3–141, 4–158, 5–177. బౌలింగ్: వైభవ్ 4–0–35–1; కార్తీక్ 4–0–40–0; అనుకూల్ రాయ్ 3–0–37–0; నరైన్ 4–0–28–1; వరుణ్ 4–0–34–2; రమణ్‌దీప్ 0.4–0–5–1.


