
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు చాలా ముందు నుంచే అతను దేశవాలీ వన్డేలు (లిస్ట్-ఏ, 50 ఓవర్ల ఫార్మాట్) కూడా ఆడటం లేదు. తాజాగా మ్యాక్సీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.
దేశవాలీ వన్డే టోర్నీ డీన్ జోన్స్ ట్రోఫీ కోసం విక్టోరియా తరఫున బరిలోకి దిగనున్నాడు. మ్యాక్సీ 2022 తర్వాత ఒకే ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగుబోయే టీ20 సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ సాధించేందుకు మ్యాక్సీ డీన్ జోన్స్ ట్రోఫీ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మ్యాక్సీ సెప్టెంబర్ 17న క్వీన్స్‌ల్యాండ్‌తో, సెప్టెంబర్ 19న టస్మానియాతో జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆడతాడు.
మ్యాక్స్‌వెల్ జట్టులో (విక్టోరియా) మ్యాట్ షార్ట్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, మార్కస్ హ్యారిస్, విల్ సదర్‌ల్యాండ్ లాంటి పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. విక్టోరియా ఈ టోర్నీ గత సీజన్‌లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. మ్యాక్స్‌వెల్ లాంటి అనుభవజ్ఞుడు ఈ సీజన్‌లో విక్టోరియా తరఫున బరిలోకి దిగుతుండటం ఆ జట్టుకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది.
ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ఇటీవలికాలంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లు ఆడింది. వీటిలో విండీస్ సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో దక్కించుకుంది. సౌతాఫ్రికా సిరీస్‌లోని నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (0/15 (2), 62* (36)) ఆకట్టుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 టీ20లు ఆడుతుంది. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా ఈ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి.