IND Vs AUS: అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ఆసీస్‌ ప్రాక్టీస్‌

Fans Surprise Australia Practising Worn-Pitches Ahead 1st Test Vs IND - Sakshi

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోపీ షురూ కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా భారత్‌కు చేరుకొని తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేయగా.. మరోవైపు శుక్రవారం నాగ్‌పూర్‌కు చేరుకున్న టీమిండియా నేటి నుంచి ప్రాక్టీస్‌ మొదలుపెట్టనుంది. కోహ్లి, రోహిత్‌, పుజారా సహా మరికొంతమంది ఇవాళ జట్టుతో కలిసే అవకావం ఉంది.

ఇదిలా ఉంటే గత సిరీస్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఆస్ట్రేలియా స్పిన్‌ అటాకింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్‌ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. ప్రస్తుతం ఆసీస్‌ జట్టు కర్ణాటకలోని ఆలూరు క్రికెట్‌ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఆసీస్‌ జట్టు కోరిక మేరకు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ గ్రౌండ్‌లో ఉన్న మూడు పిచ్‌లపై స్పిన్‌ ట్రాక్‌నే రూపొందించారు.

భారత్‌ లాంటి ఉపఖండం దేశంలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందునా పిచ్ పాతబడేకొద్ది స్పిన్నర్లు ప్రభావం చూపడం చూస్తుంటాం. భారత్‌ లాంటి పిచ్‌లపై ఇదంతా సహజం. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్‌ చేస్తే టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చనేది వారి గేమ్‌ప్లాన్‌.

అయితే ఆస్ట్రేలియా ప్రాక్టీస్‌ చేస్తున్న పిచ్‌లకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఇదేంటి అన్నట్లుగా ముక్కున వేలేసుకున్నారు. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టు స్పిన్‌ బౌలింగ్‌కు ఇంత భయపడుతుందా.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్‌ చేస్తుంది.. ఈసారి ఆసీస్‌ తమ వ్యూహాలలో పదును పెంచినట్లుంది.. స్పిన్‌ బౌలింగ్‌ అంటే అంత భయమేలా.. భారత్‌ స్పిన్‌ బౌలింగ్‌ అంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందేలే అంటూ కామెంట్‌ చేశారు.

ఆస్ట్రేలియా చివరిసారి 2017లో భారత పర్యటనకు వచ్చినప్పుడు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియాకు కోల్పోయింది. ఆ సిరీస్‌లో తొలి టెస్టులో ఆసీస్‌ 333 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అప్పటి మ్యాచ్‌లో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ స్టీవ్‌ ఒకఫీ 12 వికెట్లతో టీమిండియాను శాసించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత ఫుంజుకున్న టీమిండియా రెండు, నాలుగు టెస్టుల్లో గెలిచి.. మూడో టెస్టు డ్రా చేసుకొని 2-1 తేడాతో సిరీస్‌ గెలిచింది. స్పిన్‌ పిచ్‌లపై ఆడడంలో అప్పుడు ఆస్ట్రేలియా ఘోరంగా విఫలమైంది.

ఆ తర్వాత 2020-21లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా రహానే సారధ్యంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి చారిత్రక విజయాన్ని అందుకుంది. తాజాగా ఐదేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా ఈసారి ఎలాగైనా సిరీస్‌ను ఒడిసి పట్టుకోవాలని భావిస్తోంది. అందుకే ఏరికోరి తమ ప్రాక్టీస్‌కు స్పిన్‌ ట్రాక్‌ను తయారు చేయించుకుంది.

చదవండి: పిల్లనిచ్చిన మామకు అల్లుడి బౌలింగ్‌

'భారత్‌లో టెస్టు క్రికెట్‌ చచ్చిపోయే దశలో ఉంది'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top