Under-19 Worldcup: అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఎవరీ నివేథన్‌ రాధాకృష్ణన్‌

Facts About Australian Under-19 Bowler Indian Origin Nivethan Radhakrishnan - Sakshi

అండర్‌-19 ప్రపంచకప్‌లో ఒక భారత సంతతి కుర్రాడు అదరగొట్టాడు. ఆస్ట్రేలియన్‌ టీమ్‌లో ఆడుతున్న ఆ కుర్రాడు యాంబిడెక్స్‌ట్రస్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. తనదైన బౌలింగ్‌తో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అతనే నివేథన్‌ రాధాకృష్ణన్‌. వెస్టిండీస్‌ వేదికగా సాగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌ మెగా ఈవెంట్‌లో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ జట్టు అఫ్గనిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబరిచిన నివేథన్‌ రాధాకృష్ణన్‌ ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: ఆఖరి వరకు ఉత్కంఠ.. అదరగొట్టిన భారత సంతతి కుర్రాడు.. ఆసీస్‌దే విజయం

ముందుగా బౌలింగ్‌లో 31 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. అతని దెబ్బకు అఫ్గనిస్తాన్‌ 201 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన  ఆసీస్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్‌ కాంప్‌బెల్‌ కెలావే(51 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నివేథన్‌ రాధాకృష్ణన్‌ 66 పరుగులు సాధించాడు. ఆ తర్వాత టపాటపా వికెట్లు పడ్డాయి. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం ఎట్టకేలకు ఆసీస్‌నే వరించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడోస్థానంతో అండర్‌-19 ప్రపంచకప్‌ను ముగించింది. 

ఎవరీ నివేథన్‌ రాధాకృష్ణన్‌..
►2013లో నివేథన్‌ రాధాకృష్ణన్‌ భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి సిడ్నీలో స్థిరపడ్డాడు. 
►ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్‌ బౌలర్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఆధ్వర్యంలో బౌలింగ్‌లో రాటు దేలాడు.
►అండర్‌-16 లెవెల్‌ ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించి వైవిధ్యమైన బౌలింగ్‌తో తొలిసారి గుర్తింపు పొందాడు
►ఎన్‌ఎస్‌డబ్ల్యూ ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌లో ఆడిన నివేథన్‌ రాధాకృష్ణన్‌ ఆ సిరీస్‌లో 898 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.  ఆ తర్వాత ఎన్‌ఎస్‌డబ్ల్యూ, తస్మానియా క్రికెట్‌ నుంచి అవార్డులతో పాటు అవకాశాలు అందుకున్నాడు. 
►తస్మానియా క్రికెట్‌ తరపున ఈ సీజన్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన నివేథన్‌ రాధాకృష్ణన్‌ 622 పరుగులతో రాణించాడు.

చదవండి: జట్టులో స్టార్స్‌ లేరు.. వందకు వంద శాతం ఎఫర్ట్‌ పెడతాం.. కోహ్లి మాకు ఏం చెప్పాడంటే..

సాధారణంగా స్పిన్‌ బౌలర్‌ అయిన రాధాకృష్ణన్‌లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అతను రెండు చేతులతో(ఎడమ, కుడి) బౌలింగ్‌ చేయడంలో దిట్ట. దీంతో అతన్ని లెఫ్టార్మ్‌ ? లేక రైట్‌ ఆర్మ్? స్పిన్నర్‌ అనాలా అనేది సందిగ్దంగా మారింది. క్రికెట్‌లో ఇలాంటి బౌలర్లు ఉండడం అరదుగా జరుగుతుంటుంది. బౌలింగ్‌లో వైవిధ్యత చూపించడం కోసం ఏ బౌలర్‌ అయినా ఒకే శైలి బౌలింగ్‌కు పరిమితమవుతాడు. కానీ నివేథన్‌ రాధాకృష్ణన్‌ మాత్రం అటు లెఫ్ట్‌.. ఇటు రైట్‌ ఆర్మ్‌తో బౌలింగ్‌ చేస్తూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. 

యాంబిడెక్స్‌ట్రస్‌ క్రికెటర్‌ అంటే...
సాధారణంగా ఏకకాలంలో లెఫ్టార్మ్‌, రైట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేయగలిగిన వారిని యాంబిడెక్స్‌ట్రస్‌ క్రికెటర్‌ అని పిలుస్తారు.  అయితే ప్రస్తుత క్రికెట్‌లో ఇలాంటి శైలి అరుదుగా కనిపిస్తుంది. తాజాగా నివేథన్‌ రాధాకృష్ణన్‌ వార్తల్లో నిలవడం ద్వారా యాంబిడెక్స్‌ట్రస్‌ క్రికెటర్‌ పదం మరోసారి వెలుగులోకి వచ్చింది. క్రికెట్‌ చరిత్రలో యాంబిడెక్స్‌ట్రస్‌ క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ..  ఇప్పటివరకు ఒక ఐదుగురి పేర్లు మాత్రమే ప్రముఖంగా వినిపించాయి.

హనీఫ్‌ మొహ్మద్‌(పాకిస్తాన్‌)


పాకిస్తాన్‌ బ్యాటింగ్‌లో సూపర్‌ స్టార్‌గా వెలుగొందిన హనీఫ్‌ మొహ్మద్‌ నిజానికి రెగ్యులర్‌ బౌలర్‌ కాదు. కానీ పార్ట్‌టైమ్‌ బౌలింగ్‌ చేసిన హనీఫ్‌ రెండు చేతులతో బౌలింగ్‌ చేయగలడు. పాకిస్తాన్‌ తరపున 55 టెస్టు మ్యాచ్‌ల్లో 3915 పరుగులు చేశాడు.

గ్రహం గూచ్‌(ఇంగ్లండ్‌)


ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ దిగ్గజం గ్రహం గూచ్‌ కూడా యాంబిడెక్స్‌ట్రస్‌ ఆటగాడే. బ్యాటింగ్‌లో ఎన్నోసార్లు మెరుపులు మెరిపించిన గ్రహం గూచ్‌.. రైట్‌ ఆర్మ్‌.. లెఫ్ట్‌ఆర్మ్‌ మీడియం పేస్‌తో 23 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్‌ తరపున గ్రహం గూచ్‌ 118 టెస్టుల్లో 8900 పరుగులు.. 125 వన్డేల్లో 4290 పరుగులు సాధించాడు.

హసన్‌ తిలకరత్నే(శ్రీలంక)


స్వతహాగా లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన హసన్‌ తిలకరత్నే ఒకానొక సమయంలో శ్రీలంక క్రికెట్‌లో రాణించాడు. లంక తరపున 83 టెస్టులు.. 200 వన్డేలు ఆడిన హసన్‌ తిలకరత్నే బౌలింగ్‌లో రైట్‌ ఆర్మ్‌ స్పిన్‌ ఎక్కువగా వేసేవాడు. కానీ 1996 వన్డే ప్రపంచకప్‌లో కెన్యాతో మ్యాచ్‌లో తిలకరత్నే ఆఖరి ఓవర్లో రైట్‌ ఆర్మ్‌.. లెఫ్టార్మ్‌ బౌలింగ్‌ చేసి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 1996 వన్డే ప్రపంచకప్‌ను శ్రీలంక ఎగరేసుకపోయిన సంగతి తెలిసిందే.

అక్షయ్‌ కర్నేవార్‌(భారత్‌)


విదర్భ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అయిన అక్షయ్‌ కర్నేవార్‌ ప్రస్తుతం దేశవాలీలో లిస్ట్‌-ఏ, టి20 మ్యాచ్‌లు ఆడుతు బిజీగా గడుపుతున్నాడు. అక్షయ్‌ కర్నేవార్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌.. రైట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేయడంలో సమర్థుడు. విజయ్‌ హజారే ట్రోఫీలో విదర్భ తరపున అక్షయ్‌ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో 16 వికెట్లు తీసి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేశాడు.

కమిందు మెండిస్‌(శ్రీలంక)


17 ఏళ్ల కమిందు మెండిస్‌ శ్రీలంక తరపున రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌.. స్లో లెఫ్ట్‌ఆర్మ్‌ ఆర్థడోక్స్‌ బౌలింగ్‌ చేయడంలో దిట్ట. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో లంక తరపున ప్రాతినిధ్యం వహించి కమిందు మెండిస్‌ ఆకట్టుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top