బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్‌!.. ఊహించని షాక్‌! | Even If Government Lifts Ban No IPL 2026 Broadcast In Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్‌!.. షాకిచ్చిన జియోస్టార్‌!

Mar 30 2026 7:24 PM | Updated on Mar 30 2026 7:29 PM

Even If Government Lifts Ban No IPL 2026 Broadcast In Bangladesh

టీ20 ప్రపంచకప్‌-2026 సందర్భంగా బంగ్లాదేశ్‌ మామూలుగా రచ్చ చేయలేదు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు వేదికైన భారత్‌లో తమ ఆటగాళ్లు, సిబ్బందికి భద్రత లేదని ఆరోపించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) చెప్పినా సరే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు తమ వైఖరి మార్చుకోలేదు.

అక్కడ మొదలైన వివాదం
భారత్‌ నుంచి వేదికను శ్రీలంకకు మార్చాలని మొండిపట్టు పట్టగా.. ఐసీసీ నిరాకరించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లాదేశ్‌ ప్రకటించింది. ఈ వివాదానికి మూలకారణం ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను తొలగించడమే అని చెప్పవచ్చు.

కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులు, ఈశాన్య భారతం గురించి బంగ్లా నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో భారత్‌తో దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం
ఈ పరిణామం తర్వాత టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు భారత్‌కు రాబోమని భీష్మించుకున్న బంగ్లాదేశ్‌.. ఆఖరికి టోర్నీ నుంచే వైదొలగాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో తమ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు అప్పటి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.

యూటర్న్‌
అయితే, ఇటీవల ఎన్నికైన ప్రభుత్వం ఈ విషయంలో యూటర్న్‌ తీసుకుంది. రాజకీయాలు, క్రీడలను తాము కలపమని.. ఎవరైనా తమ దేశంలో ఐపీఎల్‌ను ప్రసారం చేయాలనుకుంటే అందుకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. 

నిజానికి భారత్‌తో క్రికెట్‌ సంబంధాలు తెంచుకుంటే బంగ్లా క్రికెట్‌ పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఊహించని షాక్‌ 
అయితే, బంగ్లా ప్రభుత్వానికి ఊహించని షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ను ప్రసారం చేసే టీ- స్పోర్ట్స్‌తో ఒప్పందాన్ని ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ జియోస్టార్‌ రద్దు చేసుకుంది. ఆర్థిక చెల్లింపుల విషయంలో టీ- స్పోర్ట్స్‌ ఆలస్యం చేయడం, ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఒప్పందం రద్దు కారణంగా
దీంతో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలకు ప్రభుత్వం అనుమతినిచ్చినా.. టీ- స్పోర్ట్స్‌ నిర్వాకం వల్ల మ్యాచ్‌లు అక్కడ ప్రసారం కావు. కాగా 2023-2027 వరకు ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూపీఎల్‌ కూడా బంగ్లాదేశ్‌లో ప్రసారం చేసుకునేందుకు జియోస్టార్‌ ద్వారా సబ్‌ లైసెన్స్‌ పొందింది. అయితే, నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అనుమతులు కోల్పోయింది. దీంతో అధికారికంగా బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారాలకు బ్రేక్‌ పడింది.

చదవండి: IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!?

Advertisement
 
Advertisement
Advertisement