ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ టీ20 మ్యాచ్‌ రద్దు | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ టీ20 మ్యాచ్‌ రద్దు

Published Wed, May 29 2024 9:10 AM

England Vs Pakistan 3rd T20 Match Abandoned Due To Rain

కార్డిఫ్‌ వేదికగా పాకిస్తాన్‌-ఇంగ్లండ్‌ మధ్య నిన్న (మే 28) జరగాల్సిన టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా టాస్‌ కూడా సాధ్యపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ కూడా వర్షం కారణంగానే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో టీ20 ఓవల్‌ వేదికగా మే 30న జరుగనుంది. 

ఈ సిరీస్‌లో జరిగిన ఏకైక మ్యాచ్‌లో (రెండో టీ20) ఇంగ్లండ్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. జోస్‌ బట్లర్‌ (84) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. షాహీన్‌ అఫ్రిది 3, ఇమాద్‌ వసీం, హరీస్‌ రౌఫ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. ఇంగ్లండ్‌ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 160 పరుగులకు చాపచుట్టేసింది. రీస్‌ టాప్లే 3, మొయిన్‌ అలీ, జోఫ్రా ఆర్చర్‌ చెరో 2 వికెట్లు.. క్రిస్‌ జోర్డన్‌, ఆదిల్‌ రషీద్‌, లివింగ్‌స్టోన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఈ సిరీస్‌ ముగిసిన వెంటనే పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ జట్లు టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఆడేందుకు బయల్దేరతాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 4న (స్కాట్లాండ్‌తో).. పాకిస్తాన్‌ తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 6న (యూఎస్‌ఏతో) ఆడనున్నాయి. మెగా టోర్నీలో భారత్‌-పాక్‌ సమరం జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా జరుగనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement