Ball Tampering: లార్డ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌​ బాల్‌ టాంపరింగ్‌ చేసిందా?

England Players Scuff Ball With Shoes Fans Says Ball Tampering 2nd Test - Sakshi

లార్డ్స్‌: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ జిడ్డు బ్యాటింగ్‌ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడంలో ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్‌ బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో ట్విటర్‌లో ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆ ఫోటోల్లో మొహాలు చూపించకపోవడంతో ఆటగాళ్లు ఎవరనేది కనిపెట్టడం కష్టంగా మారింది.

ఇక వీడియోలో బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ.. బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కుతూ... ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన భారత అభిమానులు ఉద్దేశపూర్వకంగా బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన ఇంగ్లాండ్ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఐసీసీ ఎలా రియాక్టవుతుందో చూడాలి.

ఇక క్రికెట్‌లో బాల్‌టాంపరింగ్‌ ఉదంతం అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది  ఆసీస్‌ ఆటగాళ్లు. 2018 కేప్‌టౌన్‌ టెస్ట్‌లో సాండ్‌ పేపర్‌ విధానంతో బెన్‌ క్రాప్ట్‌ బాల్‌టాంపరింగ్‌కు పాల్పడి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. అయితే ఈ ఉదంతంలో అప్పటి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ హస్తం కూడా ఉందని తెలియడంతో వారిద్దరిపై  ఏడాది పాటు నిషేధం విధించిన ఐసీసీ బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించింది. ఆసీస్‌ క్రికెటర్లు చేసిన బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం క్రికెట్‌ కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోయింది.

ఇక రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నిలకడైన ఆటతీరు ప్రదర్శిస్తుంది. టాపార్డర్‌ విఫలమైన వేళ రహానే, పుజారాలు నెమ్మదైన ఆటను ప్రదర్శిస్తూ ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా 64 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. పుజారా (33, 180 బంతులు), రహానే( 33, 106 బంతులు) క్రీజులో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top