
డబ్లిన్ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది.
ఇంగ్లండ్ బౌలర్లు ఆదిల్ రషీద్ (4-0-29-3), జేమీ ఓవర్టన్ (4-0-17-2), లియామ్ డాసన్ (2-0-9-2) అద్బుతంగా బౌలింగ్ చేసి ఐర్లాండ్‌ను కట్టడి చేశారు. రెహాన్ అహ్మద్ (3-0-24-1) కూడా పర్వాలేదనిపించాడు.
ఐర్లాండ్ బ్యాటర్లలో ఎవరూ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గెరాత్ డెలానీ (29 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల కారణంగా ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాస్ అదైర్ (33), హ్యారీ టెక్టార్ (28), బెంజమిన్ కాలిట్జ్ (22) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (7), లోర్కాన్ టక్కర్ (1), కర్టిస్ క్యాంపర్ (2), బ్యారీ మెక్‌కార్తీ (0), మాథ్యూ హంఫ్రేస్ (7) నిరాశపరిచారు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్ వారి వశం అవుతుంది. ఐర్లాండ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.